- ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చిన జగన్ ఇక అసెంబ్లీకి రావాలని సూచన
- రాజకీయ హత్యలకు సంబంధించిన వివరాలు సభలో పెట్టాలన్న మంత్రి
- ఏపీలో శాంతిభద్రతలు లేవంటూ ఢిల్లీ రోడ్లపై గగ్గోలు పెట్టడం ఎందుకని ప్రశ్న
ఇండియా కూటమితో పొత్తు కోసమే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లినట్లుగా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చిన జగన్ ఇక అసెంబ్లీకి రావాలని సూచించారు. అసెంబ్లీ వద్ద ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ… జగన్ ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చారని, ఇక శాసన సభకు వస్తే బాగుంటుందన్నారు. జగన్ ఢిల్లీ వేదికగా చెప్పిన రాజకీయ హత్యలకు సంబంధించిన వివరాలు సభలో పెట్టాలన్నారు.
ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు లేవంటూ ఢిల్లీ రోడ్లపై గగ్గోలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అలాంటిది ఏమైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలన్నారు. ఈ అంశంపై ఇవాళ శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు చెప్పారు.