- ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం
- కీలక ప్రసంగం చేసిన ప్రధాని మోదీ
- 2047 నాటికి వికసిత భారత్ సాకారం అవుతుందని ధీమా
- అన్ని రాష్ట్రాల సహకారంతో లక్ష్యాన్ని సాధిస్తామని వెల్లడి
ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, మనం సరైన దిశలోనే వెళుతున్నామని స్పష్టం చేశారు. వందేళ్లలో ఒకసారి వచ్చే కరోనా వంటి మహమ్మారిని కూడా మనం జయించాం అని చెప్పారు.
మన ప్రజలు పూర్తి ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నారని తెలిపారు. అన్ని రాష్ట్రాలతో కలిసి 2047 నాటికి వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేసుకుంటామని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. వికసిత్ భారత్-2047 అనేది ప్రతి భారతీయుడి ఆశయం అని, ప్రజలతోనే నేరుగా మమేకం కావడం ద్వారా రాష్ట్రాలు దీంట్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
ముద్ర, పీఎం విశ్వకర్మ, ఎన్ఈపీ వంటి సంస్కరణలు, నేర చట్టాల వ్యవస్థలో సంస్కరణలతో భారతీయ సమాజం, ఆర్థిక వ్యవస్థలో క్రమానుగుణ మార్పును సాధిస్తున్నామని తెలిపారు.
“భారత్ యువతతో కూడిన దేశం. మన కార్యశక్తి కారణంగా భారత్ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. మన యువతను నైపుణ్య, ఉద్యోగ కార్యశక్తిగా మలుచుకోవడంపై దృష్టి సారిద్దాం. వికసిత్ భారత్ సాకారం కావాలంటే నైపుణ్యం, పరిశోధన, ఆవిష్కరణలు, ఉద్యోగ ఆధారిత విజ్ఞానంపై అందిపుచ్చుకోవడం అవసరం. ఈ దశాబ్దం వివిధ మార్పులు, సాంకేతిక భౌగోళిక రాజకీయ రంగాలకు చెందినదే కాదు, అవకాశాలతో కూడుకున్నది కూడా. అంతర్జాతీయ పెట్టుబడులకు అనుకూలంగా మన విధానాలకు రూపకల్పన చేసేందుకు ఈ అవకాశాలను మన దేశం అందిపుచ్చుకోవాలి. భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే పురోగతికి ఇది సోపానం వంటిది” అని మోదీ వివరించారు.