తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం హోరాహోరీగా జరిగాయి. బడ్జెట్‌పై చర్చలో ప్రభుత్వ, విపక్ష సభ్యులు మాట్లాడారు. అర్ధరాత్రి దాటాక కూడా చర్చ కొనసాగింది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనసభ సమావేశాలు రాత్రి 3. 30 గంటల కొనసాగాయి.
విద్యుత్ అంశంపై సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఉత్పత్తినే బీఆర్ఎస్ తమ ఘనతగా చెప్పుకుందని, రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించిందని చర్చలో పాల్గొన్న భట్టి విక్రమార్క అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదనపు విద్యుదుత్పత్తిని చేపట్టలేదని ధ్వజమెత్తారు. యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు పేరిట ఏటా రూ.30,000 కోట్ల భారాన్ని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మోపిందని విమర్శించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వంలో విద్యుదుత్పత్తి, సరఫరా మెరుగయ్యాయని పేర్కొన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. విద్యుత్ రంగం మెరుగుదలకు తమ ప్రభుత్వం అధిక నిధులు కేటాయించిందని చెప్పారు.
గ్రూప్-1 మెయిన్స్ అర్హత నిష్పత్తిపై స్పందన
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు అర్హత నిష్పత్తిని 1:100కు పెంచాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అయితే నోటిఫికేషన్ సమయంలోనే 1:50గా అర్హతను ప్రతిపాదించామని, ఇప్పుడు సరిచేస్తే ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని భట్టి అన్నారు. పరీక్ష ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో అర్హత నిష్పత్తిపై తమ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని భట్టి వివరణ ఇచ్చారు.