- శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికిన ముఖ్యమంత్రి
- స్వాగతం పలికిన సీఎస్, డీజీపీ, త్రివిధ దళాల అధికారులు
- పంజాబ్ గవర్నర్‌గా కటారియా ప్రమాణ స్వీకారం
తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమానాశ్రయంలో స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయంలో పుష్పగుచ్ఛం ఇచ్చి ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ రావు, ఇతర ఉన్నతాధికారులు కొత్త గవర్నర్‌కు స్వాగతం పలికారు. జిష్ణుదేవ్ వర్మ కాసేపట్లో గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
పంజాబ్ గవర్నర్‌గా గులాబ్ చంద్ ప్రమాణ స్వీకారం
పంజాబ్ గవర్నర్‌గా గులాబ్ చంద్ కటారియా బుధవారం ప్రమాణం స్వీకారం చేశారు. చండీగఢ్ రాజ్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కటారియా చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పంజాబ్ కొత్త గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు.
గవర్నర్ పదవి ద్వారా పంజాబ్ ప్రజలకు సేవ చేస్తానని కటారియా అన్నారు. తనను నియమించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 45 ఏళ్లపాటు ప్రజాజీవితంలో తాను ఉన్నానన్నారు. ధర్మబద్ధంగా సేవ చేస్తానన్నారు. సామాన్యుల సమస్యలను పరిష్కరించే దిశగా తాను అడుగులు వేస్తానన్నారు. ఎవరైనాసరే వచ్చి తనతో మాట్లాడవచ్చునన్నారు. అందరితో స్నేహపూర్వకంగా మసులుకుంటానన్నారు.
తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం
- ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే
- హాజరైన సీఎం రేవంత్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- పాల్గొన్న ఉపముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
జిష్ణుదేవ్ వర్మ 1957 అగస్ట్ 15న జన్మించారు. రామజన్మభూమి ఉద్యమం సమయంలో బీజేపీలో చేరారు. 2018-2023 మధ్య త్రిపుర ఉపముఖ్యమంత్రిగా పని చేశారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా పని చేశారు. జిష్ణు దేవ్ వర్మ త్రిపుర రాజకుటుంబానికి చెందిన వ్యక్తి.