Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ, తెలంగాణ చరిత్రలో ఇంత దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు: హరీశ్ రావు తీవ్ర విమర్శలు

  • రుణమాఫీ పచ్చి అబద్ధమని తెలిశాక రాజీనామా చేయాల్సింది ఎవరని ప్రశ్న
  • రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి తగినట్లుగా మాట్లాడటం లేదన్న హరీశ్ రావు
  • రేవంత్ చేసిన తప్పుకు తెలంగాణపై ఆగ్రహం వద్దని దేవుళ్ల వద్దకు వెళ్లి ప్రార్థిస్తానని వ్యాఖ్య

“మీ రుణమాఫీ పచ్చి అబద్ధమని తెలిశాక రాజీనామా చేయాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి ఏ దేవుళ్ల మీద ఒట్టుపెట్టి మాట తప్పారో ఆ దేవుళ్ల వద్దకు వెళతాను. ఆయన చేసిన తప్పు తెలంగాణ ప్రజలకు ముప్పుగా మారవద్దని ప్రార్థిస్తాను” అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. 

రుణమాఫీ చేశామని, ఇచ్చిన హామీని మేం నిలబెట్టుకున్నందుకు… హరీశ్ రావుకు సిగ్గుంటే రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనలో అన్నారు. ఈ వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించడం లేదని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గానీ, తెలంగాణ చరిత్రలో గానీ ఇంతగా దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబద్ధం కూడా సిగ్గుపడి మూసిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేలా రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉందన్నారు. 

దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడక పోగా, నిస్సిగ్గుగా బీఆర్ఎస్ మీద, తన మీద అవాకులు చెవాకులు పేలాడని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియాగాంధీ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి 40 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని చెప్పింది ముఖ్యమంత్రే అన్నారు. అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపాడన్నారు. 

ఆగస్ట్ 15 తేదీ వరకు రూ.31 వేల కోట్లు మాఫీ చేస్తానని ఎన్నికలలో ఊదరగొట్టాడని గుర్తు చేశారు. అంటే రూ.9 వేల కోట్లు కోత పెట్టాడన్నారు. అయినప్పటికీ ఎవరూ నమ్మడం లేదని దేవుళ్ల మీద ఒట్లు పెట్టాడని విమర్శించారు.

సోనియా మీద ఒట్టు పెట్టినా, దేవుళ్ల మీద ఒట్టు పెట్టినా అబద్ధమే రేవంత్ రెడ్డి లక్షణమని… మోసమే ఆయన విధానమని వ్యాఖ్యానించారు. “మాట తప్పడమే నా నైజం అనే విధంగా తన నిజస్వరూపాన్ని ఈ రోజు బట్టబయలు చేసుకున్నాడు”అని దుయ్యబట్టారు. 

బీఆర్ఎస్ హయాంలో మొదటి దఫాలో 35 లక్షల మంది రైతులకు లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ చేస్తేనే దాదాపు రూ.17వేల కోట్లు అయిందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు చేస్తే… 22 లక్షల మంది రైతులే ఉంటారా? రూ.17,869 కోట్లు మాత్రమే మాఫీ అవుతాయా? అని నిలదీశారు. ఈ ఒక్క విషయంతోనే కాంగ్రెస్ రుణమాఫీ పచ్చి అబద్ధమని తేలిపోయిందన్నారు.

“మీరు దగా చేశారనన్నది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి? యేటిలో దూకి ఎవరు చావాలి? నోటికి వచ్చినట్లు దిగజారుడు భాషలో బీఆర్ఎస్‌ను తిడితేనో, తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో రంకెలు వేస్తేనో అబద్ధాలు నిజాలైపోవు. రేవంత్ రెడ్డి నువ్వు రైతు ద్రోహానికి మాత్రమే కాదు, దైవ ద్రోహానికి పాల్పడ్డావు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి దేవుళ్ల మీద ఒట్టుపెట్టి మాట తప్పి నువ్వు చేసిన అపచారానికి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాని నీకు ఆ సంస్కారం లేదు. నీలో ఉన్నది వికారమే తప్ప, సంస్కారం కాదు” అని ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ మాట తప్పినందుకు ఆ దేవుళ్లు తెలంగాణ మీద ఎక్కడ ఆగ్రహిస్తారో… ఆయన చేసిన పాప ఫలితం ప్రజలకు ఎక్కడ శాపంగా మారుతుందోనని ఆందోళనగా ఉందన్నారు. అందుకే ఆయన చేసిన తప్పుకు… ఆయన చేసిన దైవద్రోహానికి గాను తాను దేవుళ్ల వద్దకు వెళతానన్నారు. ఆయన చేసిన తప్పులకు తెలంగాణ మీద ఆగ్రహించవద్దని ముక్కోటి దేవుళ్లకు మొక్కుతున్నానన్నారు. ఆయన ఏ దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పారో… ఆ దేవుళ్లందరి దగ్గరికి త్వరలో తాను స్వయంగా వెళతానన్నారు. రేవంత్ రెడ్డి చేసిన తప్పు తెలంగాణ ప్రజలకు ముప్పుగా మారొద్దని ఆ దేవుళ్లను ప్రార్థించి వస్తానన్నారు.

Related posts

విజయసాయిరెడ్డికి డీఎన్ఏ టెస్ట్ నిర్వహించండి.. నా బిడ్డకు తండ్రి ఎవరో తేల్చండి: మదన్ మోహన్

Ram Narayana

బ్రిటన్ వీసా ఉంటే చాలు… ఈ  27 దేశాల్లో భారతీయులకు ఫ్రీ ఎంట్రీ!

Drukpadam

హిజాబ్ వివాదంపై స్పందించిన పాకిస్థాన్ మంత్రులు…ఇది మా ఇంటి సమస్య మేము చూసుకోగలమన్న ఒవైసి !

Drukpadam

Leave a Comment