- రూ. 2 లక్షల రుణమాఫీకి కట్టుబడి ఉన్నామన్న రేవంత్
- త్వరలోనే ప్రతి రుణం మాఫీ అవుతుందని హామీ
- బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపాటు
బీఆర్ఎస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ఆ పార్టీని నమ్ముకుని ఆగం కావొద్దని రైతులకు సూచించారు. రూ. 2 లక్షల రైతు రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం 100 శాతం కట్టుబడి ఉందని చెప్పారు. అర్హులైన ప్రతి రైతుకు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ జరగలేదని… త్వరలోనే ప్రతి రైతు రుణం మాఫీ అవుతుందని చెప్పారు. రుణమాఫీ కానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని… రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారంలో ఉందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు.
రైతుల విషయంలో కొందరు దొంగ దీక్షలు చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. సన్నాసులను నమ్ముకుని రైతులు రోడ్డెక్కాల్సిన అవసరం లేదని… మీ సమస్యలను వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పదేళ్లు దోచుకున్నవాళ్లను, ఆరు నెలల క్రితం బొంద పెట్టినవాళ్లను మళ్లీ గ్రామాల్లోకి ఎందుకు రానిస్తున్నారని ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో కేటీఆర్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. రూ. లక్ష రుణమాఫీ చేసేందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపసోపాలు పడిందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.