మీట్ ద ప్రెస్ లో రాజ్యహింస గురించి వివరించిన ప్రొఫెసర్ సాయిబాబా …
టీయూడబ్ల్యూజే నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సాయిబాబా ..
గ్రీన్ హంట్ ఆపరేషన్ ను వ్యతిరేకిస్తూ, ఆదివాసీల పక్షపాతిగా నిలబడిన పాపానికి ఉపా కేసు నమోదై, తొమ్మిదేండ్లు నాగ్ పూర్ సెంట్రల్ జైలులో నిర్భందించబడి, ఇటీవల మహారాష్ట్ర హైకోర్టు కేసును కొట్టి వేయడంతో విడుదలైన ప్రజాస్వామికవాది, ప్రముఖ స్కాలర్, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాతో శుక్రవారం నాడు బషీర్ బాగ్ లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ‘మీట్-ది-ప్రెస్’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఆయా పత్రికలు, న్యూస్ ఛానెల్స్ కు చెందిన 80మంది పాత్రికేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యం తనపై మోపిన అభియోగాలను, తొమ్మిదేండ్ల జైలు జీవిత అనుభవాలను ప్రొఫెసర్ సాయిబాబా క్షుణ్ణంగా వివరించారు. జర్నలిస్టుల పలు ప్రశ్నలకు ఆయన జవాబు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ విద్యావేత్త, పౌర హక్కుల ఉద్యమ నాయకులు ప్రొఫెసర్ ఏ.హరగోపాల్ అధ్యక్షత వహించగా, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ అలీ స్వాగతం పలికారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వి.యాదగిరి వందన సమర్పణ చేశారు.