- 15 కిలో మీటర్ల పరిధిలో 150 హెక్టార్ల విస్తీర్ణంలో నేలకూలిన 50వేల చెట్లు
- టోర్నడో తరహా గాలుల వల్ల కావచ్చని అభిప్రాయపడుతున్న నిపుణులు
- కూలిపోయిన చెట్లను పరిశీలించిన సీసీఎఫ్ ప్రభాకర్, డీఎఫ్ఓ రాహుల్ జావేద్
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో సుమారు 50వేల చెట్లు నేలమట్టం అవ్వడం అధికార యంత్రాంగాన్ని తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది. అడవుల్లో పెద్ద ఎత్తున గాలి దుమారం, సుడి గాలుల బీభత్సంతో మహావృక్షాలు సైతం కుప్పకూలాయి. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఆగస్టు 31న సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య మేడారం ప్రాంతంలో భారీ వర్షంతో పాటు బలమైన ఈదురు గాలులు వీచాయి. దీంతో ఏటూరు నాగారం మండలం కొండాయి నుండి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకూ భారీ నష్టం జరిగింది. సుమారు 15 కిలో మీటర్ల పరిధిలో దాదాపు 150 హెక్టార్ల విస్తీర్ణంలో సుమారు 50వేల చెట్లు నేలకూలాయి.
విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఈ నెల 1న పరిశీలనకు వెళ్లి చూశారు. అక్కడి దృశ్యాలను చూసి వారు షాక్ కు గురయ్యారు. టోర్నడోల్లాంటి బలమైన సుడిగాలులే ఈ స్థాయి లో చెట్లను కూల్చివేస్తాయని వాతావారణ నిపుణులు అంటున్నారు. భారీ వృక్షాలు సైతం నేలకొరగడాన్ని బట్టి చూస్తే గంటకు 120 కిలో మీటర్ల వేగంతో వీచిన గాలులే కారణం అయి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. జిల్లా ఫారెస్ట్ అధికారి రాహుల్ జావేద్ ఆధ్వర్యంలోని బృందం ఉపగ్రహ డేటా, భారత వాతావరణ శాఖ (ఐఎండీ), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్‌సీ) తో కలిసి పరిశీలన జరుపుతోంది. సీసీఎఫ్ ప్రభాకర్ తో కలిసి డీఎఫ్ఓ మంగళవారం తాడ్వాయ్ – మేడారం అడవుల్లో నేలమట్టమైన చెట్లను పరిశీలించారు.