Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

కేజ్రీవాల్ అరెస్ట్ చట్టబద్దమని సుప్రీంకోర్టు చెప్పింది… సీఎంగా కొనసాగే హక్కు లేదు: బీజేపీ

  • షరతులతో కూడిన బెయిల్ రావడం విశేషం కాదన్న వీరేంద్ర సచ్‌దేవ్
  • లాలూ ప్రసాద్, మధుకోడా వంటి సీఎంల జాబితాలో చేరిపోయారని వ్యాఖ్య
  • సీఎం పదవికి ఎందుకు రాజీనామా చేయడం లేదని మరో నేత గౌరవ్ భాటియా ప్రశ్న

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చట్టబద్ధమని, ఆయనపై అభియోగాలు చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు చెప్పిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా అన్నారు. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… షరతులతో కూడిన బెయిల్ రావడం పెద్ద విశేషం కాదన్నారు. తదుపరి విచారణ ఉంటుందని గుర్తు చేశారు. త్వరలో ఆయనకు శిక్షపడటం ఖాయమన్నారు.

జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్‌, మధుకోడా వంటి ముఖ్యమంత్రుల జాబితాలో కేజ్రీవాల్ కూడా చేరారన్నారు. ఆయన బెయిల్‌పై బయటకు వచ్చినా మళ్లీ శిక్ష అనుభవించేందుకు జైలుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. కేజ్రీవాల్‌కు సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. ముఖ్యమంత్రిగా చేయాల్సిన పని చేయలేనప్పుడు ఇక ఆ పదవి ఎందుకని ప్రశ్నించారు.

సీఎం పదవికి ఎందుకు రాజీనామా చేయడం లేదు: గౌరవ్ భాటియా

ఢిల్లీ మద్యం పాలసీ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయడం లేదో చెప్పాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ప్రశ్నించారు. కేజ్రీవాల్‌కు బెయిల్ రావడం పట్ల ‘నిజాయతీ గెలిచింది’ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ట్వీట్‌పై ఆయన మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీకి నైతికత లేదన్నారు. కేజ్రీవాల్ తన పదవిని ఎందుకు వదులుకోవడం లేదో చెప్పాలని నిలదీశారు.

బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించదన్నారు. అవినీతిపరుడైన కేజ్రీవాల్ ఎప్పటికైనా తలవంచక తప్పదని హెచ్చరించారు. కేజ్రీవాల్ రాజీనామా చేయాలని త్వరలో ప్రజలే డిమాండ్ చేసే పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారని గుర్తించాలన్నారు. కేజ్రీవాల్ ప్రస్తుతం నిందితుల కేటగిరీలో ఉన్నారని పేర్కొన్నారు. ఆయన పాస్‌పోర్ట్ కోర్టు వద్దనే ఉంటుందని, ఆయన విదేశాలకు వెళ్లలేరని చురక అంటించారు.

Related posts

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేం: సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్!

Ram Narayana

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదు!

Ram Narayana

ఢిల్లీలో న్యూస్ క్లిక్ వెబ్ పోర్టల్ పై దాడి గర్హనీయం …ఇది భావప్రకటనా స్వేచ్ఛపై దాడి ..ఐజేయూ అధ్యక్షులు కె .శ్రీనివాస్ రెడ్డి…

Ram Narayana

Leave a Comment