- చెరువుల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రాను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- హైడ్రాకు 169 మంది అదనపు సిబ్బందిని కేటాయిస్తూ ఉత్తర్వులు
- నలుగురు అదనపు కమిషనర్లు సహా అదనపు సిబ్బంది కేటాయింపు
హైడ్రాకు అదనపు సిబ్బందిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో హైడ్రాకు 169 మంది సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో నలుగురు అదనపు కమిషనర్లు, ఐదుగురు డీసీపీలు, 16 మంది ఎస్సైలు, 60 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజినీర్లు డిప్యుటేషన్‌పై హైడ్రా కోసం పని చేయనున్నారు.
ఇదిలా ఉండగా, హైడ్రా మూసీ నది ఆక్రమణల కూల్చివేతలపై దృష్టి సారించింది. మూసీ పరివాహక ప్రాంతంలో 1,350 మందికి నోటీసులు జారీ చేశారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఇళ్లను మార్క్ చేసింది. మరోవైపు కలెక్టర్లు, అధికారులు మూసీ నిర్వాసితుల ప్రాంతాల్లో పర్యటించారు. మూసీ ఆక్రమణల వివరాలను ఇప్పటికే రెవెన్యూ, హైడ్రా అధికారులు సేకరించారు. శని, ఆదివారాల్లో ఆక్రమణల కూల్చివేయనున్నారు. గోల్నాక, చాదర్‌ఘాట్, మూసారంబాగ్ ప్రాంతాల్లో మూసీని ఆనుకొని ఆక్రమణలను కూల్చివేసేందుకు హైడ్రా రంగం సిద్ధం చేసింది.