Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
హైద్రాబాద్ వార్తలు

హైడ్రా పై సోషల్ మీడియాలో వ్యతిరేకత కనిపిస్తుందన్న కమిషనర్ రంగనాథ్


బఫర్‌జోన్‌లో ఉన్న ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేశామని, కానీ ఆ పక్కనే ఉన్న గుడిసెలను కూల్చలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. కొన్ని కట్టడాలను కూల్చినప్పుడు హైడ్రా బాగా పని చేసిందని కితాబునిచ్చారని, ఇప్పుడు మాత్రం కొందరు వ్యతిరేకిస్తున్నారని వాపోయారు. తాము అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేశామన్నారు. హైడ్రా అధికారులు, మూసీ రివర్ ఫ్రంట్ అధికారులు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ… సోషల్ మీడియాలో హైడ్రాపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నారు.

అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయన్నారు. ఓ ఆసుపత్రిపై అధికారులు గతంలో చర్యలు తీసుకున్నప్పటికీ అదేచోట మళ్లీ నిర్మించారని తెలిపారు. అమీన్‌పూర్‌లో ఆసుపత్రిని కూల్చేశారని చెబుతున్నారని, కానీ ఆ ఆసుపత్రిలో రోగులు ఎవరూ లేరని వెల్లడించారు. ఇందుకు సంబంధించి వీడియో రికార్డ్ చేశామన్నారు.

ప్రజలు నివసిస్తున్న భవనాలను కూల్చలేదన్నారు. ఇటీవల కూకట్‌పల్లి నల్ల చెరువులో ఆక్రమణలను కూల్చివేశామని తెలిపారు. ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ కొంతమంది ఖాళీ చేయలేదని తెలిపారు. హైడ్రా విషయమై భయంతో బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నదని, ఇది తెలిసి తాను చాలా బాధపడ్డానని రంగనాథ్ అన్నారు. బుచ్చమ్మను కొంతమంది భయపెట్టారన్నారు.

హైడ్రా అంటే భరోసా… బాధ్యత

హైడ్రా అంటే భరోసా, బాధ్యత అని గుర్తించాలన్నారు. హైడ్రాను బూచిగా చూడవద్దని, చూపించవద్దని కోరారు. ఎవరికైనా సమయం ఇచ్చిన తర్వాతనే కూల్చివేతలు ప్రారంభిస్తున్నామన్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ చెరువులను, నాలాలను కాపాడుకోలేమన్నారు. ఆస్తుల రక్షణకే ముఖ్యమంత్రి హైడ్రాను తీసుకువచ్చారన్నారు. విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ హైడ్రా బాధ్యత అన్నారు.

హైడ్రాను ఏర్పాటు చేసి రెండు నెలలు అయిందన్నారు. ప్రభుత్వ, ప్రజల ఆస్తులను పరిరక్షించే బాధ్యత తమపై ఉందని వెల్లడించారు. పరిశుభ్రమైన వాతావరణంలో జీవించడం మన హక్కు అని, ప్రజల ఆస్తులను రక్షించాలని రాజ్యాంగంలోనే ఉందని వెల్లడించారు. పేదలను ఇబ్బంది పెట్టాలనేది హైడ్రా అభిమతం కాదన్నారు. కానీ అక్రమ కట్టడాల వెనుక పెద్దవాళ్లు ఉన్నారన్నారు.

Related posts

హైద‌రాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ల దందా!

Ram Narayana

హైడ్రా తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు!

Ram Narayana

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు: బాలరాజు

Ram Narayana

Leave a Comment