Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి కీలక ప్రకటన!

  • ముడా నుంచి పొందిన భూములను తిరిగి ఇచ్చేస్తానని ప్రకటన
  • మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి లేఖ రాసిన సీఎం భార్య పార్వతి
  • తన భర్త గౌరవం కంటే ఏదీ ఎక్కువ కాదని ప్రకటన
  • ఆమె ప్రకటనను స్వాగతిస్తున్నట్టు తెలిపిన సీఎం సిద్ధరామయ్య

కర్ణాటకలో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్న ముడా భూకుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదైన గంటల వ్యవధిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముడా (మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) నుంచి తాను పొందిన 14 పరిహార భూములను తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు ముడాకు ఆమె లేఖ రాశారు. ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్యతో పాటు మరికొందరిపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

తన భర్త, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో కఠినమైన నైతిక నిబంధలను పాటించారని, ఎలాంటి మచ్చ లేకుండా నడుచుకున్నారని లేఖలో ఆమె పేర్కొన్నారు. ‘‘ నా భర్త సిద్ధరామయ్య రాజకీయ జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను జీవించాను. నా భర్త కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు’’ అని లేఖలో ఆమె పేర్కొన్నారు.

కాగా భూముల కేటాయింపునకు సంబంధించిన ముడా స్కామ్‌లో పార్వతిపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై కూడా ఆమె స్పందించారు. తన వ్యక్తిగత సంపద లేదా ఆస్తి కోసం ఎప్పుడూ తాను వెతకలేదని అన్నారు. తన భర్త ప్రజల గౌరవాన్ని పొందడం తనకు ఎనలేని ఆనందాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త గౌరవానికి మించిన భౌతిక సంపద ఏదీ లేదని వ్యాఖ్యానించారు. ఇక ఆస్తులు తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్న తన భార్య నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య కూడా ప్రకటించారు.

కాగా సీఎం సిద్ధరామయ్యతో పాటు మరికొందరిపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) సెక్షన్ల కింద కేసు సమాచార నివేదిక (ఈసీఐఆర్) దాఖలు చేసింది. ఈసీఐఆర్ అంటే పోలీసు ఎఫ్ఐఆర్‌తో సమానమని ఈడీ వర్గాలు తెలిపాయి.

భార్య నిర్ణయంపై సిద్దరామయ్య ఆశ్చర్యం.. ఆమె విద్వేష రాజకీయాల బాధితురాలని ఆవేదన

She Is A Victim Of Politics Of Hate Says Siddaramaiah
  • భూములను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు నిన్న పార్వతి ప్రకటన
  • ప్రభుత్వానికి తిరిగి అప్పగించారన్న సిద్దరామయ్య
  • భార్య నిర్ణయం ఆశ్చర్యం కలిగించినా గౌరవిస్తున్నానన్న సీఎం
  • తనపై జరుగుతున్న విద్వేష రాజకీయాలతో ఆమె కలత చెందిందన్న సిద్దూ

తన భార్య పార్వతి విద్వేష రాజకీయ బాధితురాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. మైసూరు అప్‌మార్కెట్ ప్రాంతంలో తనకు కేటాయించిన 14 ప్రత్యామ్నాయ స్థలాలను ప్రభుత్వానికి తిరిగి అప్పగించినట్టు మంగళవారం ఎక్స్ ద్వారా వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీ నేతలు తన కుటుంబాన్ని వివాదాల్లోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. భూముల కేటాయింపు విషయంలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం తనకు కేటాయించిన 14 స్థలాలను వెనక్కి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సీఎం భార్య పార్వతి నిన్న మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కమిషనర్‌కు లేఖ రాసిన నేపథ్యంలో తాజాగా సిద్ధరామయ్య ఇలా స్పందించారు.

తమ నుంచి తీసుకున్న భూమికి పరిహారంగా ఇచ్చిన భూమిని తన భార్య పార్వతి తిరిగి ఇచ్చేసిందని సిద్దరామయ్య తెలిపారు. రాజకీయ లబ్ధికోసం ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్న విషయం ప్రజలకు తెలుసని, తన కుటుంబాన్ని అకారణంగా వివాదాల్లోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్యాయానికి తలొగ్గకుండా పోరాడతానని స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న రాజకీయ కుట్రతో తన భార్య కలత చెంది ఈ ప్లాట్లను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలనుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నారు. 

తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తన కుటుంబం ఏనాడూ జోక్యం చేసుకోలేదని సిద్దరామయ్య పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న విద్వేష రాజకీయాల్లో ఆమె బాధితురాలిగా మారిందని, మానసికంగా చిత్రహింసలు అనుభవించిందని వాపోయారు. ఏది ఏమైనా తన భార్య నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని తెలిపారు.

Related posts

కర్ణాటక ఫలితాలపై భారత్ జోడో యాత్ర ప్రభావం ఎంత?… జైరాం రమేశ్ విశ్లేషణ ఇదే!

Drukpadam

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ను కాల్చిచంపిన దుండగులు

Ram Narayana

ఆధార్ వివరాల ఉచిత అప్ డేట్ గడువును మరోసారి పొడిగించిన కేంద్రం

Ram Narayana

Leave a Comment