టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వైఖరి
ఎమ్మెల్యే కొలికపూడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనీ మహిళల నిరసన
మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపణలు
కావాలనే తనపై చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరంటున్న ఎమ్మెల్యే కొలికపూడి
పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో దీక్ష విరమించిన ఎమ్మెల్యే కొలికపూడి
టీడీపీ అధిష్టానానికి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రావు తలనొప్పిగా మారారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి…ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ చిట్టేల గ్రామంలో సోమవారం మహిళలు రహదారిపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. మహిళల పట్ల ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగుల వాట్సాప్ నంబర్లకు ఆయన అసభ్యకరంగా సందేశాలు పంపిస్తూ లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. కొలికపూడిపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని, లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని మహిళలు హెచ్చరించారు.
మరో పక్క, తనపై చేసిన ఆరోపణలు నిజమైతే అరెస్టు చేసి శిక్షించాలని, లేని పక్షంగా ఆరోపణలు చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన క్యాంప్ కార్యాలయంలో దీక్ష చేపట్టారు. అయితే పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో సోమవారం రాత్రి ఆయన తన దీక్షను విరమించారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో దీక్షను విరమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సోమవారం రాత్రి ఆయన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. తనపై ఆరోపణలు చేస్తున్న మహిళ ఇప్పటి వరకూ నాలుగు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని చెప్పారు. ఆమె భర్తపై పోలీసులు ఎప్పుడు కేసు పెట్టినా ఇలాంటి ఆత్మహత్య డ్రామాలు అడుతుంటుందని ఆరోపించారు. తనపై పథకం ప్రకారం చేస్తున్న అసత్య ప్రచారాన్ని నియోజకవర్గ ప్రజలు నమ్మరని కొలికపూడి అన్నారు.