- బ్యాంకు ఖాతాలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ నమ్మించిన మోసగాళ్లు
- డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్టుగా పచ్చి మోసం
- ఈడీ, సీబీఐ, సుప్రీంకోర్టు రంగంలోకి దిగినట్టుగా నమ్మించిన వైనం
- తప్పించేందుకు రూ.7 కోట్లు ఇవ్వాలని డిమాండ్
- మోసపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్పీ ఓస్వాల్
- రూ.5 కోట్లు రివకరీ చేసిన పోలీసులు
డబ్బులు కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త దారులు తొక్కుతున్నారు. ఇప్పటివరకూ వెలుగుచూసిన అన్ని మోసాలను మించి మరో ఘరానా మోసం వెలుగుచూసింది. కోర్ట్ సెట్టింగ్ వేసి.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణ జరుపుతున్నట్టుగా సీన్ క్రియేట్ చేసి పారిశ్రామికవేత్త, ప్రముఖ టెక్స్‌టైల్స్ కంపెనీ వర్ధమాన్ గ్రూపు సంస్థల చైర్మన్ ఎస్పీ ఓస్వాల్‌ను ఏకంగా రూ.7 కోట్లకు మోసం చేసిన ఘటన వెలుగు చూసింది.
ముంబైలోని సీబీఐ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామంటూ ఆగస్టు 28న ఓస్వాల్‌కు సైబర్ మోసగాళ్లు వీడియో కాల్ చేశారు. మీ పేరిట ఉన్న కెనరా బ్యాంకు ఖాతాలో ఆర్థిక అవకతవకలు జరిగాయని, మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జెట్ ఎయిర్‌వేస్ మాజీ చైర్మన్ నరేశ్ గోయల్ వ్యవహారంతో మీ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధం ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. ఈ కేసులో నిందితుడిగా చేరుస్తున్నామని నమ్మించారు. అయితే తనకు కెనరా బ్యాంక్ అకౌంట్ లేదని ఓస్వాల్ సమాధానం ఇచ్చారు. ‘‘నాకు నరేశ్ గోయల్ కూడా తెలియదు. కాకపోతే జెట్ ఎయిర్‌వేస్‌లో ప్రయాణించాను. అప్పుడు ఆధార్ వివరాలు ఇచ్చి ఉంటాను’’ అని ఓస్వాల్ చెప్పడంతో కేటుగాళ్లు అప్పటికప్పుడే రూట్ మార్చారు. మీ ఆధార్‌తోనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారని, ఆధార్ దుర్వినియోగం అయిందని నమ్మించారు.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని కేటుగాళ్లు చెప్పారు. ఆ కొద్దిసేపటికే మరొకరు ఫోన్ చేసి తాను చీఫ్ ఇన్వెస్టింగ్ ఆఫీసర్‌నని, డిజిటల్ అరెస్టుకు సంబంధించిన నిబంధనలు ఇవిగో అంటూ ఒక మెసేజ్ పంపించారు. ఆ వెంటనే మరికొందరు ఫోన్ చేసి ఓస్వాల్‌కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేట్‌మెంట్ రికార్డు పేరిట బాల్యం, చదువు, వ్యాపారాలు, ఆస్తులు వంటి వివరాలను తెలుసుకున్నారు. ఆ తర్వాత ఈడీ, ముంబై పోలీసుల లోగోలతో కూడిన అరెస్టు వారెంట్‌ను వాట్సప్‌లో పంపించారు. దాని మీద ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ నీరజ్ కుమార్ పేరుతో ఓ సంతకాన్ని కూడా సృష్టించారు.
వీడియో కాల్‌లోనే కోర్టు విచారణ..
నిందితుడిని వీడియో కాల్‌లోనే కోర్టు విచారణ కూడా జరిపారు. ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ కేసును విచారిస్తున్నట్లు సెట్టింగు వేసి నమ్మించారు. జస్టిస్ చంద్రచూడ్ జారీ చేసినట్టుగా ఓస్వాల్‌కు ఆదేశాలు పంపించారు. ఆ నోటీసులపై సుప్రీంకోర్టు లోగో కూడా ఉండేలా చూసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేసిన కేటుగాళ్లు మిమ్మల్ని రక్షిస్తామని, అందుకే రూ.7 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వేర్వేరు బ్యాంక్ అకౌంట్లకు ఆయన ఏకంగా రూ.7 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ తర్వాత అంతా మోసం అని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి రూ.5 కోట్లు రికవరీ చేశారు.
కేటుగాళ్లు అరెస్ట్
కాగా ఈ మోసానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. గువాహటిలో అతాను చౌదరి, ఆనంద్ కుమార్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇది అంతర్రాష్ట్ర ముఠా పని అని, రుమి కలితా అనే మాజీ బ్యాంకు ఉద్యోగి ఈ దోపిడీ వెనకున్న అసలైన సూత్రధారి అని వెల్లడించారు. కేసులో మిగతా నిందితులను గాలిస్తున్నట్టు తెలిపారు.