- పవన్ హిందూత్వ అజెండాను ఎత్తుకున్నాడంటున్న సీపీఎం
- పవన్‌ను బీజేపీ ఆడిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శ
- చంద్రబాబును దింపేసి పవన్‌ను ఆస్థానంలో కూర్చోబెట్టాలని బీజేపీ కుట్రలు చేస్తోందన్న నేత
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో వ్యవహరిస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. దీంతో పవన్ బీజేపీ కాషాయ రాజకీయాలను ఫాలో అవుతున్నారని విమర్శలు వచ్చాయి. కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఏమి చెబితే దానికి తగ్గట్లుగా పవన్ ఆడుతున్నారని వామపక్షాల నేతలు విమర్శిస్తున్నారు.
ఈ తరుణంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనం అయ్యాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను బీజేపీ ఆడిస్తోందని శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబును సీఎం పదవి నుంచి దింపేసి ఆ స్థానంలో పవన్ కల్యాణ్‌ను కూర్చొబెట్టాలని బీజేపీ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఏపీని నాశనం చేసేందుకు పవన్ కల్యాణ్‌ను బీజేపీ వాడుకుంటుందని విమర్శించారు. రాష్ట్రంలో వంద రోజుల కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనబడుతోందని ఆయన అన్నారు.