హరియాణాలో నాయబ్‌సింగ్ సైనీ మ్యాజిక్..!!
కంప్యూటర్ ఆపరేటర్ టు సీఎంగా రాజకీయ ప్రస్థానమిదే!
మాస్ లీడర్ కాదంటూ రాజకీయ విశ్లేషకులు తక్కువ అంచనా వేశారు. డమ్మీ సీఎం అంటూ ప్రతిపక్ష నేతలు విమర్శించారు. ఓటమి అంచున ఉన్న బీజేపీని గెలిపించడం అసాధ్యమంటూ సొంత పార్టీలోనే కొందరు పెదవి విరిచారు. రైతులు, నిరుద్యోగులు, అగ్నివీరులు తదితర వర్గాల ఆగ్రహం, అధిక ధరలు వంటి సమస్యలు చుట్టుముట్టిన వేళ పదేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీకి గెలుపు అవకాశాల్లేవనీ ఇంకొందరు కొట్టిపారేశారు. అటువంటి తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ కేవలం 200 రోజుల్లోనే పార్టీని విజయ పథంలో నడిపించి మ్యాజిక్ చేశారు హరియాణా సీఎం నాయబ్ సింగ్ సైనీ.
ఒక్కో మెట్టు ఎక్కుతూ..✌️
అంబాలా జిల్లా మిర్జాపుర్ మజ్రా గ్రామంలో 1970 జనవరి 25న నాయబ్ సింగ్ సైనీ జన్మించారు. బీఏ, ఎల్‌ఎల్‌బీ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చారు. 1996లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా జీవితాన్ని మొదలుపెట్టారు. మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌తో సాన్నిహిత్యమే రాజకీయ జీవితంలో వేగంగా ఎదగటానికి బాటలు వేసింది. అంబాలా జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా, బీజేపీ కిసాన్ మోర్చా హరియాణా శాఖ ప్రధాన కార్యదర్శిగా ఇలా సైనీ వివిధ స్థాయిల్లో సేవలందించారు. మనోహర్ లాల్ ఖట్టర్ క్యాబినెట్‌లో హోంమంత్రిగా చేశారు. 2014లో అసెంబ్లీకి నారాయణ్ గఢ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2019లో కురుక్షేత్ర స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2023 అక్టోబరులో హరియాణా బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
సీఎంగా బాధ్యతలు
ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని గ్రహించిన బీజేపీ అగ్రనాయకత్వం ఈ ఏడాది మార్చిలో సైనీకి సీఎం బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత రెండున్నర నెలలకే లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలకూ సుమారు 200 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో సైనీ వేగంగా ప్రజాకర్షక పథకాలపై దృష్టి పెట్టారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయటం, గ్రామ పంచాయతీల వ్యయ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.21 లక్షలకు పెంచారు. దీంతో క్షేత్ర స్థాయిలో అభివృద్ధి పనులకు వీలు కలిగింది. విద్యుత్తు వినియోగదారులపై భారంగా మారిన కనీస ఛార్జీలను రద్దు చేశారు. వినియోగించిన కరెంటుకు మాత్రమే బిల్లులు చెల్లించేలా మార్చారు. అగ్నివీర్ పథకంపై అసంతృప్తిని చల్లార్చేందుకు రాష్ట్రానికి ప్రత్యేకంగా అగ్నివీర్ పాలసీ-2024ను తీసుకొచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ చర్యలు ఆకట్టుకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పరిమితంగానే పాల్గొన్నప్పటికీ మిగిలిన బాధ్యతలను సైనీ తన భుజానికెత్తుకున్నారు