రైతుల సంక్షేమమే లక్ష్యంగా కమిటీ పని చేయాలి…రాష్ట్ర మంత్రులు తుమ్మల, పొంగులేటి!
సంక్రాంతి నాటికి మద్దులపల్లి మార్కెట్ యార్డ్ పెండింగ్ పనులు పూర్తి
సన్న రకం వడ్లకు క్వింటాల్ 500 రూపాయల బోనస్
రైతులకు పూర్తి ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి పంటల బీమా పథకం అమలు
రైతులు లాభదాయక పంట ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలి
రైతుల సంక్షేమమే లక్ష్యంగా నూతన మార్కెట్ కమిటీ పని చేయాలని, రైతులకు మద్దతు ధర అందేలా కృషి చేయాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు అన్నారు. గురువారం మంత్రులు ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రుల సమక్షంలో మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా నియమించబడిన బి. హరినాథ బాబు, ఉపాధ్యక్షులుగా నియమితులైన వి. నరేందర్ రెడ్డి, ఇతర పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖా మాత్యులు తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ, నిబద్దత కలిగిన కార్యకర్తలను గుర్తించి పదవులు అందిస్తున్నామని అన్నారు. మద్దులపల్లి మార్కెట్ పూర్తి చేసేందుకు 20 కోట్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు.గతంలో తనకు పాలేరు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న త్రాగు నీరు, సాగు నీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కరించామని, తిరుమలాయపాలెం మండలంలో ఉన్న నీటి సమస్యను పరిష్కరించడంతో ఎకరానికి కోట్ల రూపాయల విలువ కలిగిందని అన్నారు.
కరువు ప్రాంతంగా ఉన్న పాలేరు నియోజకవర్గాన్ని అత్యంత సాగునీరు వసతి కలిగిన ప్రాంతంగా తీర్చిదిద్దామని అన్నారు. పాలేరు నియోజకవర్గంలో ఉన్న నదుల మీద చెక్ డ్యాంలు, బ్రిడ్జి లు కట్టామని అన్నారు. ఇంటింటికి నల్లా పెట్టి త్రాగు నీరు అందించామని అన్నారు. కాల్వ క్రింద లేని మండలాలు పామాయిల్ సాగు చేయాలని, రైతులు మరింత లాభం పొందుతారని మంత్రి తెలిపారు. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి నలు వైపులా జాతీయ రహదారి వచ్చాయని, అన్ని గ్రామాలకు రోడ్లు వచ్చాయని అన్నారు. మార్కెట్ కమిటీ పాలకవర్గ క్రింద వచ్చిన పదవులు రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో వినియోగించాలని అన్నారు.
పాలేరు నియోజకవర్గానికి ఉన్న వనరులను సమర్ధవంతంగా వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. మన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ క్రింద 18 వేల కోట్ల మాఫీ చేశామని మంత్రి తెలిపారు. 2 లక్షల పైన ఉన్న రుణాలు ఉన్న రైతులకు షెడ్యూల్ ప్రకటించి రుణమాఫీ పూర్తి చేస్తామని అన్నారు. దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, సన్నాలు పండించే రైతులకు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ప్రకటించామని అన్నారు. రైతుల పంటలకు కూడా పంటల భీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. రుణమాఫీ పథకం తర్వాత రైతు భరోసా పథకం అమలు అవుతుందని అన్నారు.
క్వింటాల్ కు వెయ్యి రూపాయలు నష్టం వచ్చినప్పటికీ తడిచిన పెసర్లను మద్దతు ధరపై కొనుగోలు చేశామని తెలిపారు. మొక్కజొన్నలు, సోయా, పొద్దు తిరుగుడు, కందులు, ఎర్ర జొన్నలు మొదలగు పంటలకు మార్కెట్ లో ధర లేని సమయంలో వేల కోట్ల నష్టం వచ్చినప్పటికీ రైతులను నిలబెట్టాలని మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మద్ధులపల్లి వ్యవసాయ మార్కెట్ ను అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఖమ్మం మార్కెట్ కు వచ్చే ఓవర్ లోడ్ ను మద్దులపల్లి మార్కెట్ గ్రహిస్తుందని అన్నారు. మద్ధులపల్లి వ్యవసాయ మార్కెట్ పెండింగ్ పనులు 3 నెలలో పూర్తి చేసి సంక్రాంతి నాటికి మార్కెట్ ప్రారంభించడం జరుగుతుందని అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తున్నామని అన్నారు. 6 నెలల సమయంలో 4 గ్యారెంటీ అమలు చేశామని అన్నారు. 27 రోజులో సుమారు 18 వేల కోట్ల రుణాలు 24 లక్షల మంది రైతులకు మాఫీ చేశామని అన్నారు. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రుణాలు షెడ్యూల్ ప్రకారం చెల్లిస్తే పెండింగ్ రుణమాఫీ నిధులు సైతం ప్రభుత్వం విడుదల చేస్తుందని అన్నారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని వర్గాల విద్యార్థుల కోసం 25 ఎకరాలలో సమీకృత గురుకులాల నిర్మాణం చేస్తున్నామని, శుక్రవారం మొదటి విడత సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నామని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి నెలాఖరు నాటికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి , ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల సహాయం అందిస్తామని అన్నారు.చెరువుల ఎఫ్.టి.ఎల్, బఫర్ జోన్లలో పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్న బడా బాబుల నిర్మాణాలపై హైకోర్టు అనేక సార్లు అక్షింతలు వేసినప్పటికీ గత ప్రభుత్వాలు పట్టించు కోలేదని, తమ ప్రభుత్వం చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటుందని, అక్రమ నిర్మాణాలను తొలగిస్తుందని అన్నారు.పేదలకు అండగా ఉండే అంశంలో ప్రజా ప్రభుత్వం ముందు ఉంటుందని, త్వరలోనే ధరణిని రద్దుచేసి నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం ప్రవేశపెట్టి భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ లు రాయల నాగేశ్వరరావు, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ. అలీమ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.