Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

పండుగ పూట సొంతూరికి సీఎం రేవంత్ రెడ్డి… ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు

  • ప్రతి ఏటా దసరాను కొండారెడ్డిపల్లిలో జరుపుకుంటున్న రేవంత్ రెడ్డి
  • ఈసారి సీఎం హోదాలో సొంతూరికి రాక
  • కొండారెడ్డిపల్లిలో పలు భవనాలను ప్రారంభించిన రేవంత్ రెడ్డి

దసరా పండుగ రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరికి వెళ్లారు. సీఎం హోదాలో తొలిసారిగా నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి విచ్చేశారు. ప్రతి సంవత్సరం విజయదశమి పండుగను రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలోనే జరుపుకుంటారు. ఈసారి సీఎంగా సొంతూరిలో వేడుకలు జరుపుకుంటుండడం విశేషం. కాగా, రేవంత్ రెడ్డికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. తన పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి నూతన పంచాయతీ భవనం, వెటర్నరీ హాస్పిటల్, అమర జవాను యాదయ్య మెమోరియల్ లైబ్రరీ, బీసీ సామాజిక భవనాలను ప్రారంభించారు. 

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్​రెడ్డి.. స్వగ్రామం నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూర్‌ మండలం కొండారెడ్డి పల్లిలో దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర రథసారథికి స్థానికులు పూల జల్లులు, డప్పు దరువులు, కోలాటాలతో ఆత్మీయంగా ఆహ్వానించారు. బతుకమ్మలు, బోనాలు, గజమాలతో దారి పొడవునా జై రేవంత్‌రెడ్డి అంటూ నినాదాలతో హోరెత్తించారు. అభివృద్ధి ప్రదాతకు గ్రామ వీధుల గుండా భారీ ప్రదర్శన నిర్వహించి సాదరస్వాగతం పలికారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. రూ.18 కోట్లతో భూగర్భ మురుగునీటి వ్యవస్థ, అంతర్గత రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.32 లక్షలతో చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్‌కు శంకుస్థాపన చేశారు. రూ.55 లక్షలతో నిర్మించిన యాదయ్య స్మారక గ్రంథాలయాన్ని ప్రారంభించారు . రూ.64 లక్షలతో మోడ్రన్‌ బస్టాండ్, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థకు భూమిపూజ చేశారు. రూ.70 లక్షలతో నిర్మించిన బీసీ కమ్యూనిటీ భవనాన్ని జాతికి అంకితం చేశారు. రూ.18 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ది పనుల్లో పాల్గొన్న అనంతరం గ్రామ పంచాయతీ భవనం ఎదుట మామిడి మొక్కను నాటారు.

సొంతూరి వారందరినీ పేరుపేరున పలకరించిన ముఖ్యమంత్రి : గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం స్థానిక హనుమాన్ ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామశివారులోని జమ్మిచెట్టు దగ్గర కుటుంబంతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అక్కడికి విచ్చేసిన స్థానికులందరికీ దసరాశుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే సొంతూరి వారందరినీ పేరుపేరున ముఖ్యమంత్రి పలకరించడంతో స్థానికులు ఎంతగానో ఆనందించారు. రాష్ట్రప్రజలంతా సుభిక్షంగా సుఖసంతోషాలు, పాడిపంటలతో తులతూగాలని దేవుడిని సీఎం ప్రార్థించారు. ముఖ్యమంత్రి రాకతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి వెంట నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోశ్​, అచ్చంపేట శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ, కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్​ రెడ్డి, స్థానిక ప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సీఎం రాక నేపథ్యంలో అధికారులు కొండారెడ్డిపల్లిలో భారీగా ఏర్పాట్లు చేశారు.

Related posts

మహిళలకు బతుకమ్మ చీరలకు బదులు రూ. 500..

Ram Narayana

కేసీఆర్ పాలన మోసం దగా…420 కేసు పెట్టాలి…పొంగులేటి సుధాకర్ రెడ్డి ..!

Ram Narayana

కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టిన రేవంత్ …రంగంలోకి కాంగ్రెస్ హైకమాండ్..!

Drukpadam

Leave a Comment