Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

మంత్రి కొండా సురేఖను వదలని వివాదాలు!

  • ఫ్లెక్సీ వివాదంతో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ
  • పోలీసుల అదుపులో మంత్రి కొండా అనుచరులు 
  • మంత్రి కొండా సురేఖ నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైనం    

తెలంగాణ మంత్రి కొండా సురేఖను వివాదాలు వదలడం లేదు. తాజాగా ఆమె మరో వివాదంలో చిక్కుకున్నారు. సమంత – నాగచైతన్య విడాకుల వ్యవహారంపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదం కావడం, ఆ వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో పాటు క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ నటుడు నాగార్జున కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ వివాదం మరువకముందే మంత్రి సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. 

పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన అనుచరులను ఎందుకు అరెస్టు చేశారంటూ మంత్రి సురేఖ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే .. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ధర్మారంలో మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య ఆదివారం వివాదం నెలకొంది. దసరా పండుగను పురస్కరించుకుని ధర్మారంలో కొండా సురేఖ అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో రేవూరి ఫోటో లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఫ్లెక్సీలు ధ్వంసం చేశారు. 

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కొండా సురేఖ అనుచరులు ..రేవూరి వర్గీయులపై దాడికి పాల్పడ్డారు. దీనిపై రేవూరి వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో గీసుకొండ పోలీసులు కొండా సురేఖ వర్గానికి చెందిన ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన ఆ ముగ్గురిని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ వరంగల్ – నర్సంపేట ప్రధాన రహదారిపై కొండా వర్గీయులు ధర్నా చేశారు. చివరకు సమస్యను పరిష్కరిస్తామని సీఐ మహేందర్ హామీ ఇవ్వడంతో కొండా అనుచరులు ధర్నా విరమించారు. 

మరో పక్క తన వర్గీయులైన ముగ్గురిని గీసుకొండ పోలీసులు అరెస్టు చేయడంపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే ఆమె నేరుగా గీసుకొండ పోలీసులు స్టేషన్ కు చేరుకున్నారు. తన అనుచరులను ఎందుకు అరెస్టు చేశారంటూ నిలదీశారు. మంత్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చారని తెలియడంతో పెద్ద సంఖ్యలో ఆమె అనుచరులు అక్కడకు చేరుకున్నారు. 

విషయం వివాదాస్పదం కావడంతో వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝూ అక్కడకు చేరుకున్నారు. దీనికి బాధ్యులైన డీఎస్పీ, సీఐ, ఎస్ఐలను వెంటనే రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు. 

Related posts

బీజేపీ తీర్థం పుచ్చుకున్న చికోటి ప్రవీణ్

Ram Narayana

బిగ్ బ్రేకింగ్.. రాజా సింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ

Ram Narayana

ముస్లిం సమాజానికి… హిందూ యువతకు బండి సంజయ్ విజ్ఞప్తి

Ram Narayana

Leave a Comment