- నెల రోజులుగా సమ్మె చేస్తున్న 33 వేల మంది ఉద్యోగులు
- నిలిచిపోయిన విమానాల తయారీ
- మూడో త్రైమాసికంలో 5 బిలియన్ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకున్న సంస్థ
- ఉద్యోగుల తొలగింపు ద్వారా నష్టాన్ని భర్తీ చేసే యోచన
విమాన తయారీ దిగ్గజ సంస్థ బోయింగ్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తమ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మంది అంటే 17 వేల మంది ఉద్యోగులపై వేటుకు రెడీ అయింది. ఈ మేరకు సంస్థ సీఈవో కెల్లీ ఓర్ట్‌బెర్గ్ ఈమెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. కంపెనీ తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
సియాటెల్ ప్రాంతంలో ఆ సంస్థకు చెందిన 33 వేల మంది కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో పలు విమానాల ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె కారణంగా 2025లో డెలివరీ చేయాల్సిన 777 ఎక్స్ విమానాలను ఆ తర్వాతి ఏడాదికి అంటే 2026కు వాయిదా వేసింది. ఇప్పటికే ఉన్న ఆర్డర్లు పూర్తయిన తర్వాత 2027 నుంచి 767 ఫ్రైటర్ విమానాల ఉత్పత్తిని కూడా నిలిపివేయాలని కంపెనీ యోచిస్తోంది.
ఇక ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించిన తర్వాత కంపెనీ షేర్లు 1.7 శాతం పతనమయ్యాయి. కార్మికుల సమ్మె కారణంగా మూడో త్రైమాసికంలో సంస్థ 5 బిలియన్ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు ఇప్పుడు 17 వేల మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైంది.