Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

వాయనాడ్‌లో ప్రియాంక గాంధీపై ప్రముఖ సినీ నటి పోటీ…?

  • వాయనాడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ప్రియాంక గాంధీ
  • ప్రియాంక గాంధీపై సినీ నటి ఖుష్భూను పోటీకి నిలిపే ఆలోచనలో బీజేపీ ఉందని ప్రచారం
  • అదంతా పుకారేనని కొట్టి పారేసిన ఖుష్భూ
  • పార్టీ అదేశిస్తే ప్రియాంకపై పోటీకి సై అంటానని వెల్లడి  

కేరళలోని వాయనాడ్‌ లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటు కేరళలోని వాయనాడ్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు. ఈ క్రమంలో వాయనాడ్ ఎంపీ పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. దీంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్ధి పీపీ సునీర్‌పై 4 లక్షల 31వేల మెజార్టీతో విజయం సాధించగా, 2024 లోక్ సభ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్ధి యేనీ రాజాపై 3 లక్షల 64వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గం కంచుకోటగా మారడంతో ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ బరిలో దిగారు. 

అయితే ప్రియాంక గాంధీపై ప్రముఖ సినీనటి ఖుష్బూ సుందర్‌ను పోటీకి దింపే ఆలోచన బీజేపీ చేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. దీనిపై ఆమె స్పందిస్తూ ఎన్నికల వేళ ఇలాంటి పుకార్లు మామూలేనని అన్నారు. ఇది పుకారు మాత్రమేనని స్పష్టం చేశారు. కానీ పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే తాను ప్రియాంక గాంధీ‌పై పోటీ చేయడానికి సిద్ధమేనని ఖుష్భూ తెలిపారు. 

కాగా, వాయనాడ్ ఉప ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయంగా కనబడుతోంది. ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీ బలమైన అభ్యర్ధిని బరిలో దింపింది. తమ అభ్యర్ధిగా సత్యన్ మొఖేరీని కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా ప్రకటించింది. దీంతో కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ అభ్యర్ధుల మధ్య త్రిముఖ పోరు జరగనుంది. వాయనాడ్ లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 13న జరగనుంది. నవంబర్ 23న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పాటే వాయనాడ్‌లోనూ ఓట్లను లెక్కించి ఫలితాన్ని వెల్లడించనున్నారు. 

Related posts

యూపీలోని తొలిదశ నుంచే బీజేపీ పతనం ప్రారంభమవుతుంది: అఖిలేశ్ యాదవ్

Ram Narayana

దక్షణ కన్నడ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం …డాక్టర్ పొంగులేటి

Ram Narayana

బెంగళూరులో ప్రధానికి స్వాగతం పలకకపోవడంపై డీకే శివకుమార్

Ram Narayana

Leave a Comment