- ఇందుకోసం ఒక ప్రత్యేక యాప్‌ను తీసుకువస్తున్న న్యాయస్థానం
- తాజాగా యాప్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించిన సుప్రీంకోర్టు
- ఇందులోని లోటుపాట్లను సవరించి త్వరలోనే లైవ్ స్ట్రీమింగ్
ఇప్పటికే ఎన్నో సంచలనాత్మకమైన మార్పులతో ముందుకు వెళుతున్న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇప్పుడు మరో కొత్త ప్రయోగం చేయబోతోంది. ఇకపై సుప్రీంకోర్టులో జరిగే అన్ని కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేలా చర్యలు చేపడుతోంది.
దీనిలో భాగంగా రూపొందించిన ఒక ప్రత్యేక యాప్‌ను తాజాగా ప్రయోగాత్మకంగా పరీక్షించడం జరిగింది. ఇందులోని లోటుపాట్లను సవరించి త్వరలోనే ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు రెడీ అవుతోంది.
ఇక కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం విషయమై సుప్రీంకోర్టు 2018లోనే అనుకూల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కానీ ఆ నిర్ణయం ఆచరణలోకి రాలేదు.
అయితే, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేసిన రోజు.. ఆయన నేతృత్వంలోని ధర్మాసనం నాటి కార్యకలాపాలను దేశ ప్రజలంతా వీక్షించేలా ఏర్పాట్లు చేయించింది. సుప్రీంకోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం అదే మొదటిసారి కూడా.
ఆ తర్వాత రాజ్యాంగ ధర్మాసనం విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయాలని రెండేళ్ల క్రితం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో జరిగే అన్ని కేసుల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అంతా సిద్ధమైంది. దీంతో త్వరలోనే దేశ సర్వోన్నత న్యాయస్థానంలో జరిగే కేసుల విచారణను అందరూ ప్రత్యక్షంగా వీక్షించే వీలు కలగనుంది.