- ఇటీవల హత్యకు గురైన ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ
- తన తండ్రి న్యాయం కోసం, మార్పు కోసం పోరాడారన్న జీషన్ సిద్దిఖీ
- ఆయన పోరాటం తన నరనరాల్లోనూ ప్రవహిస్తోందన్న ఎమ్మెల్యే
ముంబైలో ఇటీవల హత్యకు గురైన ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ కుమారుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖీ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన తండ్రిని చంపిన హంతకులు ఇప్పుడు తనపై దృష్టి పెట్టారని పేర్కొన్నారు. అయితే, ఇలాంటి వాటికి తాను భయపడబోనని, తన ఒంట్లో ప్రవహిస్తున్నదని సింహం రక్తమని, అది గర్జిస్తూనే ఉంటుందని చెప్పారు. బాబా సిద్దిఖీ ఈ నెల 21న హత్యకు గురయ్యారు.
వారు (హంతకులు) తన తండ్రిని చంపి విజయం సాధించామని అనుకుంటున్నారని, కానీ తన తండ్రి సింహం లాంటి వారని, ఆ గర్జన తనతోనే ఉందని పేర్కొన్నారు. మార్పు కోసం, న్యాయం కోసం తన తండ్రి పోరాడారని, ఆ పోరాటం తన నరనరాల్లో ప్రవహిస్తోందని ఎక్స్ ద్వారా వెల్లడించారు.
వారు తన తండ్రి ప్రాణాలు తీసుకున్నారని, కానీ అదే స్థానం నుంచి తాను గర్జిస్తానని తెలిపారు. వంద్రే ఈస్ట్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. కాగా, బాబా సిద్దిఖీ హత్య కేసులో పోలీసులు ఇప్పటి వరకు పదిమందిని అరెస్ట్ చేశారు.