ఈ నెల 25న రాష్ట్ర గవర్నర్ పర్యటన.. అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ
రాష్ట్ర గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించిన అదనపు కలెక్టర్
ఈ నెల 25న జిల్లాలో రాష్ట్ర గవర్నర్ పర్యటిస్తారని, పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర స్థాయిలో భారత రాష్ట్రపతి ప్రతినిధి అని, ప్రోటోకాల్ పరంగా అన్ని జాగ్రత్తలు చేపట్టాలన్నారు. అధికారులు తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు.
ఈ నెల 25న మధ్యాహ్నం ఎన్ఎస్పి గెస్ట్ హౌజ్ చేరుకొని, మధ్యాహ్నం 2.00 గంటలకు కలెక్టరేట్ చేరుకుంటారని, గంటపాటు జిల్లా అధికారులతో ఇంటరాక్ట్ అవుతారని, మ. 3.00 గంటల నుండి ప్రసిద్ధ కవులు, కళాకారులు, రాష్ట్ర, కేంద్ర అవార్డు గ్రహీతలతో ఇంటరాక్ట్ అవుతారని, సాయంత్రం 4.00 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతారని అదనపు కలెక్టర్ అన్నారు.
జిల్లా అధికారులతో ఇంటరాక్ట్ సందర్భంగా అన్ని శాఖలకు సంబంధించి ఇక చక్కటి పిపిటి రూపకల్పన చేయాలని, ఇందుకు సంబంధించి బుధవారం మధ్యాహ్నం లోగా తమ తమ శాఖలకు సంబంధించి స్లైడ్స్ పంపాలన్నారు. అధికారులు తమ శాఖల కార్యకలాపాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. శాఖలకు సంబంధించి స్టాళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు, కాన్వాయ్ లో అంబులెన్స్ ప్రోటోకాల్ తో ఉండాలని, జిల్లా అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, డిఆర్డీవో సన్యాసయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో అరుణ, తదితరులు పాల్గొన్నారు.