- పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా మార్నింగ్ వాక్‌లకు వెళ్లడం లేదన్న సీజేఐ
- గాలి నాణ్యత పడిపోయినందున వ్యక్తిగత వైద్యుడి సలహా మేరకు ఈ నిర్ణయమని వ్యాఖ్య
- ఇంట్లోనే ఉండడం ద్వారా శ్వాసకోశ వ్యాధులకు దూరంగా ఉండొచ్చన్న చంద్రచూడ్
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తుండడంతో, రోజురోజుకూ గాలి నాణ్యత తగ్గిపోతోంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కాలుష్యం మాత్రం తగ్గడంలేదు. కాలానుగుణంగా పెరుగుతున్న కాలుష్యం అక్కడి నివాసితుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వారి ఆరోగ్య నియమావళిని ప్రభావితం చేస్తోంది.
ఇదే విషయమై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం సుప్రీంకోర్టులో విలేకరులతో సీజేఐ మాట్లాడుతూ, పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా మార్నింగ్ వాక్‌లకు వెళ్లడం మానేసినట్లు చెప్పారు.
“ఈ రోజు నుండి నేను మార్నింగ్ వాక్‌లకు వెళ్లడం మానేశాను. సాధారణంగా నేను ఉదయం 4 నుండి 4.15 గంటల ప్రాంతంలో వాకింగ్‌కు వెళ్తాను” అని ఆయన చెప్పారు.
ప్రస్తుతం బయటి వాతావరణంలో గాలి నాణ్యత బాగా పడిపోయినందున ఉదయాన్నే బయటకు వెళ్లకపోవడం మంచిదని తన వ్యక్తిగత వైద్యుడి సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇంట్లోనే ఉండడం ద్వారా శ్వాసకోశ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని వైద్యుడు చెప్పినట్లు సీజేఐ పేర్కొన్నారు.
ఇక గడిచిన వారం రోజులుగా ఢిల్లీలో గాలి నాణ్యత చాలా పడిపోయింది. దీంతో ఢిల్లీ దేశంలోనే అత్యంత అధ్వానమైన గాలి నాణ్యతను నమోదు చేసింది. రాష్ట్రాలు అవసరమైన కాలుష్య నిరోధక చర్యలను పాటించకపోవడంపై సుప్రీంకోర్టు.. కేంద్రం, పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను హెచ్చరించింది.
జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఏ అమానుల్లా, జస్టిస్ ఏజీ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు కర్రలను కాల్చడాన్ని అరికట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించింది.
రెండు రాష్ట్రాల నుండి వచ్చే విషపూరిత పొగలు తరచుగా ఢిల్లీని కాలుష్యభూతం చేస్తున్నాయి. ప్రతి శీతాకాలంలో దేశ రాజధానిని ఉక్కిరిబిక్కిరి చేసే మంచు కాలుష్యానికి కారణమవుతున్నాయి.
ఇక రాజధాని ప్రాంతంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఏర్పాటైన సంస్థ తన లక్ష్యాన్ని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందంటూ గత నెలలో ఢిల్లీలోని ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ కు సుప్రీంకోర్టు మొట్టికాయ వేసిన విషయం తెలిసిందే.
ఇదిలాఉంటే.. భారత 50వ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా నవంబర్ 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.