- గత నెలలో విజయవాడలో భారీ వరదలు
- గతంలో కొల్లేరు ఆక్రమణలపై తాము పోరాడామన్న నారాయణ
- అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కొల్లేరు ఆక్రమణలపై ఫిర్యాదు
- ఆయన ఆదేశాలతో నాటి సీఎం వైఎస్ చర్యలు తీసుకున్నారని వెల్లడి
- కొల్లేరులో చేపల చెరువుల్ని తక్షణమే ధ్వంసం చేయాలని డిమాండ్
- సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కు నారాయణ లేఖ
గత నెలలో బుడమేరు పొంగి… విజయవాడలో సంభవించిన వరదలకు కారణం కొల్లేరు ఆక్రమణలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ సందర్భంగా కొల్లేరు సంబంధిత పలు విషయాలను ఆయన గుర్తు చేశారు.
గతంలో కొల్లేరు ఆక్రమణలపై తాము పోరాడినట్లు తెలిపారు. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఫిర్యాదు చేయడంతో నాటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ఆర్ చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఈ క్రమంలో కొల్లేరు సరస్సు ఆక్రమణలపై నాటి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ లవ్ అగర్వాల్‌ను ఫిష్ మాఫియా టార్గెట్ చేయడంతో ఆయనకు హాని జరగకుండా తామే అండగా నిలిచామన్నారు.
ప్రస్తుతం కొల్లేరు చుట్టూ ఆక్రమణలు భారీగా పెరిగిపోయాయన్నారు. చివరికి కొల్లేరు తడి భూములు, పక్షుల అభయారణ్యం కూడా అక్రమార్కులు ఆక్రమించడం బాధ కలిగిస్తుందన్నారు. కొల్లేరులో చేపల చెరువుల్ని తక్షణమే ధ్వంసం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
100 చదరపు మైళ్ల విస్తీర్ణం కలిగిన కొల్లేరు సరస్సు ఇప్పుడు 20-25 ఎకరాలు మాత్రమే మిగిలిందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కొల్లేరు సరస్సును కాపాడే మంచి అవకాశం వచ్చిందన్నారు.
ఈ సందర్భంగా కొల్లేరు పరిరక్షణపై సుప్రీంకోర్టు కూడా ధిక్కరణ నోటీసులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కొల్లేరు ఆక్రమణలపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు నారాయణ లేఖ రాశారు.