- 9 మందికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
- బాంద్రా-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాం మీదికి రాగానే తొక్కిసలాట
- క్షతగాత్రులను బాంద్రా ఆసుపత్రికి తరలించిన పోలీసులు
దీపావళి పండుగ రద్దీ నేపథ్యంలో ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. తెల్లవారుజామున 5.56 గంటలకు ప్లాట్‌ఫాం నంబర్ 1లో జరిగిన ఈ ఘటనలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంద్రా-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాం మీదికి రాగానే ప్రయాణికులు ఒక్కసారిగా రైలు ఎక్కేందుకు ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను బాంద్రా ఆసుపత్రికి తరలించారు.
పండుగ రద్దీ కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పేర్కొంది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపింది. తొక్కిసలాట కారణంగా గాయపడిన వారి రక్తపు మరకలు ఫ్లాట్‌ఫాం నిండా కనిపించాయి. కొందరు ప్రయాణికులు స్పృహ తప్పి ప్లాట్‌ఫాంపై పడిపోయారు. రైల్వే పోలీసులు సకాలంలో స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు.