- ఆవు నెయ్యి సేకరణపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన మంత్రి ఆనం
- 15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుందని తెలిపిన మంత్రి
- ఏటా సుమారు 1500 టన్నుల ఆవు నెయ్యి అవసరం అవుతుందని అంచనా
రాష్ట్రంలోని దేవాలయాలకు నెయ్యి సరఫరా అంశంపై వివిధ డెయిరీ సంఘాలు, సంస్థల ప్రతినిధులతో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రసాదాల తయారీ, ఇతర అవసరాలకు వినియోగించే ఆవు నెయ్యి సేకరణ అంశంలో అనుసరించాల్సిన విధానాలపై నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించినట్లు తెలిపారు.
ఈ కమిటీ 15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుందని చెప్పారు. రాష్ట్రంలోని ఆలయాల్లో వివిధ అవసరాలకు గానూ ఏటా సుమారు 1500 టన్నుల ఆవు నెయ్యి అవసరం పడుతుందని, పూర్తి నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో నిర్దేశిత పరిమాణంలో సేకరించేలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆనం తెలిపారు.
ఈ క్రమంలోనే రాష్ట్రంలోని డెయిరీల్లో ఆవు నెయ్యి ఉత్పత్తి ఎంత..? నెయ్యి సేకరణ విధానం తదితర విషయాలను మంత్రి ఆనం అడిగి తెలుసుకున్నారు. ఒక కేజీ ఆవు నెయ్యి ఉత్పత్తికి సుమారు 25 లీటర్ల పాలు అవసరం అవుతాయని డెయిరీ నిర్వాహకులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
గతంలో డెయిరీల నుండి నేరుగా దేవాలయాలు నెయ్యిని సేకరించే విధానం అమలులో ఉండగా, 2022లో ఆ విధానాన్ని మార్పు చేసి టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారని అధికారులు, డెయిరీ ప్రతినిధులు మంత్రికి వివరించారు. టెండర్లలోని షరతులు, నిబంధనల కారణంగా వివిధ డెయిరీలు సరఫరాకు వెనుకడుగు వేశాయని మంత్రికి తెలిపారు. ఈ సమావేశంలో సంఘం డెయిరీ చైర్మన్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.