Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సొంతంగా ఖర్చు పెట్టి అభ్యర్థుల్ని గెలిపించే ఓటర్లు ఉన్న ఏకైక నియోజకవర్గమిదే!: తుమ్మల నాగేశ్వరరావు

  • అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అన్న తుమ్మల
  • ప్రజలకోసం చిత్తశుద్ధితో యజ్ఞంలా రాజకీయం చేశానని వ్యాఖ్య
  • జనశక్తి ముందు వందల కోట్ల డబ్బులు ఏమీ చేయలేవన్న తుమ్మల నాగేశ్వరరావు

సొంతంగా ఖర్చు పెట్టి అభ్యర్థులను గెలిపించే ఓటర్లు ఉన్న ఏకైక నియోజకవర్గం సత్తుపల్లి అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తాను , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేర్వేరు కాదన్నారు. అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అన్నారు. అధికార పార్టీ వందల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉందని, కానీ జనశక్తి ముందు ఆ డబ్బులు ఏమీ చేయలేవన్నారు. శనివారం కుప్పెనకుంట్లలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయసమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రజలకోసం తాను చిత్తశుద్ధితో యజ్ఞంలా రాజకీయం చేశానన్నారు. సీతారామ ప్రాజెక్టు ఇస్తానంటేనే తాను బీఆర్ఎస్‌లో చేరానన్నారు. 

తన చిన్నప్పుడే ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పని చేశానని చెప్పారు. తనకు మంత్రి పదవి అవసరం లేదని, వాటి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నారు. సత్తుపల్లి అభ్యర్థి మట్టా రాగమయిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పది రోజులు కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కష్టపడాలని, ఆ తర్వాత ప్రజల కోసం మేం కష్టపడతామన్నారు. తాను నాలుగు దశాబ్దాలుగా ప్రజా అభిమానంతో రాజకీయం చేస్తున్నానన్నారు. డిసెంబర్ 3న కాంగ్రెస్ గెలుస్తుందని, 9వ తేదీన ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకున్న వారిని గద్దె దించడమే లక్ష్యమని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే పార్టీలను గెలిపించుకోవాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశం దమ్మపేటలో, సత్తుపల్లి నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశంలో పెనుబల్లి మండలంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు పాత నాయకులతో కలిసి ఐక్యంగా ముందుకు వెళ్లాలన్నారు. ప్రతి ఒక్క ఓటరు ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను, మ్యానిఫెస్టోను వివరించి కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లను కొనడానికి కొంతమంది వ్యాపారవేత్తలు డబ్బు సంచులతో నియోజకవర్గానికి వస్తున్నారని, కాంగ్రెస్ కు ఉన్న ప్రజాబలం ముందు అవేమీ పనికి రావని తెలిపారు. బూత్ స్థాయిలో ప్రతి 50 కుటుంబాలకు ఒక ఏజెంట్ గా ఉండి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని అన్నారు. అనంతరం రెండు నియోజకవర్గాలకు చెందిన 1000 మందికి పైగా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచుకున్నారు. తుమ్మల, పొంగులేటి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Related posts

హైదరాబాద్ లో బీభత్సం సృష్టించిన భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం..!

Drukpadam

ఇక రోజుకు 90 వేల మందికే అయ్యప్ప దర్శనం!

Drukpadam

భాగ్యనగర వాసులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్-ముంబై మధ్య బుల్లెట్ రైలు!

Drukpadam

Leave a Comment