- 17 రష్యా చానళ్లను నిషేధించిన యూట్యూబ్
- వాటిని పునరుద్ధరించాలన్న ఆదేశాలు బేఖాతరు
- 2 అన్‌డెసిలియన్ రూబుళ్ల జరిమానా విధింపు
- ఈ భూమ్మీద చలామణిలో ఉన్న డబ్బు కంటే ఇది అధికం
- అమెరికా, బ్రిటన్ కోర్టుల్లో కేసులు వేసిన గూగుల్
సెర్చింజన్ దిగ్గజం గూగుల్-రష్యా చానళ్ల మధ్య ఏర్పడిన వివాదం భారీ జరిమానాకు దారి తీసింది. నిషేధించిన రష్యన్ చానళ్లను పునరుద్ధరించాలని ఆదేశించినా ఆ పని చేయనందుకు గాను రష్యాలోని మాస్కో కోర్టు 2 అన్‌డెలిసిలియన్ రూబుళ్లు (20.6 డెసిలియన్ డాలర్లు) జరిమానా విధించింది. అంటే.. 20,604,600,000,000,000,000,000,000,000,000,000 డాలర్లు. ఇది ప్రపంచ జీడీపీ 105 ట్రిలియన్ డాలర్లు కంటే ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమ్మీద చలామణిలో ఉన్న మొత్తం సొమ్ము కంటే ఇది చాలా ఎక్కువ. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ మొత్తం మార్కెట్ విలువ కూడా 2 ట్రిలియన్ డాలర్లకు మించదు. ఈ లెక్కన ఈ మొత్తం జరిమానాగా చెల్లించడం గూగుల్‌కే కాదు.. ఈ భూమ్మీదున్న మరే సంస్థకు సాధ్యం కాదు.
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకే?
క్రెమ్లిన్ అనుకూల, రష్యా ప్రభుత్వ అధికార మీడియా సహా 17 చానళ్లను యూట్యూబ్ నిలిపివేసింది. వీటిని పునరుద్ధరించాలంటూ మాస్కో కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ గూగుల్ పట్టించుకోకపోవడంతో కోర్టు ఈ జరిమానా విధించింది. దీంతో స్పందించిన గూగుల్ రష్యన్ టీవీ చానళ్ల యజమానులకు వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్ కోర్టుల్లో కేసులు వేసింది.