Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

బంగ్లాదేశ్ లో 30 వేల మంది హిందువుల ర్యాలీ..!

  • మైనారిటీలపై దాడులను అరికట్టాలని డిమాండ్
  • ఛాటోగ్రామ్ నగరంలో రోడ్డెక్కిన హిందువులు
  • హింస నుంచి తమను రక్షించాలంటూ ప్రభుత్వానికి వినతి

బంగ్లాదేశ్ లో మైనారిటీ వర్గాలపై ఇటీవల దాడులు పెరిగిపోయాయి. ముఖ్యంగా అక్కడి హిందువులపై దాడి ఘటనలు ఎక్కువయ్యాయి. దేశవ్యాప్తంగా అన్నిచోట్లా హింస పెరిగింది. తమకు రక్షణ లేకుండా పోయిందని హిందువులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తమపై దాడులను అరికట్టాలంటూ ఛాటోగ్రామ్ నగరంలోని హిందువులు రోడ్డెక్కారు. ఏకంగా 30 వేల మంది భారీ ర్యాలీ జరిపారు. తమకు రక్షణ కల్పించాలని మధ్యంతర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారు. ఈ ర్యాలీ నేపథ్యంలో బంగ్లాదేశ్ పోలీసులు, సైనికులు ఛాటోగ్రామ్ లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

ప్రజల్లో వ్యతిరేకత, విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాకు పారిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం తాత్కాలికంగా ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. దేశంలో ప్రశాంత వాతావరణం నెలకొని, ఎన్నికలు జరిగాక కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు యూనస్ ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తారని అక్కడి సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు సద్దుమణిగాయి. అయితే, దేశంలోని మైనారిటీ కమ్యూనిటీ అయిన హిందువులపై దాడులు పెరిగాయి. గత ఆగస్టు నుంచి వేలాది మంది హిందువులపై దాడులు, దోపిడీ ఇతరత్రా అకృత్యాలు జరిగాయని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలుచోట్ల హిందువులు ర్యాలీలు, నిరసనలు చేపడుతున్నారు.

Related posts

ఒక్క సెకనులో 2 లక్షల సినిమాలు డౌన్​ లోడ్​.. ప్రపంచంలోనే హైస్పీడ్​ ఇంటర్నెట్​!

Ram Narayana

ముదురుతున్న వివాదం.. కెనడాపై భారత్ గుస్సా!

Ram Narayana

ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో భారతీయుడు.. ప‌ట్టించిన వారికి రూ. 2 కోట్ల రివార్డు!

Ram Narayana

Leave a Comment