వైసీపీకి తలనొప్పిగా రఘురామ వ్యవహారం
-ప్రివిలేజ్ కమిటీ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని స్పీకర్ ను కోరిన ఎంపీ రఘురామ
-తనపేరు వైసీపీ వెబ్ సైట్ నుంచి తొలగించినందున స్వతంత్రుడిగా గుర్తించాలని విజ్నప్తి
-నియోజకవర్గంలో తన దిష్టిబొమ్మలు తగలబెట్టడం పై ఫిర్యాదు
ఢిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామ వ్యవహారం రోజుకొక స్టోరీ తో సీరియల్ కథను తలపిస్తుంది. మొత్తానికి ఆయన వ్యవహారం వైసీపీ తలనొప్పిగా మారింది. పార్టీకి ఆయనకు గ్యాప్ పెరిగిన దగ్గరనుంచి ఆయన వైసీపీ పై పార్టీ పైన , ప్రభుత్వంపైనా , ప్రత్యేకించి ముఖ్యమంత్రి జగన్ పైన విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు రోజుకొక లేక రాస్తూ తన చిరాకు తెప్పిస్తున్నారు. పార్టీ పట్ల విధేయత గాలికి వదిలేశారు . పార్టీ,ప్రభుత్వం , ముఖ్యమంత్రి పైనే యుద్ధం చేస్తున్నారు.
రాజుగారి వ్యవహారం దేశంలోని మిగతా పార్టీలకు ఒక గుణపాఠంగా మారింది. పార్టీకి నాయకత్వానికి విధేయతపై ఒకటికి పది సార్లు ఆలోచించి టికెట్స్ కేటాయించే పరిస్థితి ఏర్పడింది . పార్టీ అంటే ఇష్టం లేకపోతె తప్పుకోవడం ,లేదా తప్పించడం జరగాలి ఇక్కడ అది జరగడం లేదు .వైసీపీ స్పీకర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోవడం లో జాప్యం జరుగుతుంది. దీనితో ఇటీవల మరోసారి పార్టీ ఎంపీలు స్పీకర్ ను కలిసి రిమైండర్ నోటీసు ఇచ్చారు.
స్పీకర్ ఓంబిర్లాతో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. ప్రివిలేజ్ కమిటీ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్‌తో సహా తనపై దాడి చేసిన అధికారులందరిపై త్వరితగతిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రఘురామ కోరారు. వైసీపీ అధికారిక వెబ్‌సైట్ నుంచి తన పేరును తొలగించిన విషయాన్ని స్పీకర్ దృష్టికి ఆయన తీసుకెళ్లారు. 48 గంటల్లో తన పేరును వెబ్‌సైట్‌లో చేర్చకపోతే.. మరోసారి కలిసేందుకు స్పీకర్ అపాయింట్‌మెంట్ కోరారు. తన దిష్టిబొమ్మలను అధికార పార్టీ నేతలు తగులబెడుతున్నారని స్పీకర్ దృష్టికి రఘరామ తెచ్చారు.
వైసీపీ అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపీల జాబితా నుంచి తన పేరు తొలగించారని రఘురామకృష్ణరాజు తెలిపిన విషయం తెలిసిందే. 48 గంటల్లోగా తిరిగి తన పేరును ఆ వెబ్‌సైట్‌లో చేర్చకపోతే, తనను స్వతంత్ర ఎంపీగా గుర్తించాలని పార్లమెంటు సెక్రటేరియట్‌ను కోరతానని అల్టిమేటం జారీ చేశారు. వైసీపీ అధికారిక వెబ్‌సైట్‌లో పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు 28మంది పేర్లతో జాబితా పెట్టారని, ఇటీవల ఉపఎన్నికల్లో గెలుపొందిన తిరుపతి ఎంపీ గురుమూర్తి పేరును కూడా ఆ జాబితాలో చేర్చారని గుర్తు చేశారు. తనను పార్టీ నుంచి బహిష్కరించనప్పుడు, పార్టీ వెబ్‌సైట్‌లో తన పేరును ఎందుకు తొలగించారో స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు.