- జీ20 శిఖరాగ్ర సదస్సుకు ముందు ఓ కార్యక్రమంలో మస్క్‌పై జంజా లులా డా సిల్లా అనుచిత వ్యాఖ్యలు
- తనను ఎవరూ ఆపలేరంటూ అసభ్యకర పదజాలం
- నవ్వుతున్న ఎమోజీతో స్పందించిన మస్క్
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌పై బ్రెజిల్ ప్రథమ పౌరురాలు జంజా లులా డా సిల్వా నోరు పారేసుకున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సుకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తప్పుడు సమాచార వ్యాప్తిని నియంత్రించడంలో ఎక్స్ విఫలమైందన్న ఆమె.. తనను ఎవరూ ఆపలేరంటూ మస్క్‌పై అసభ్యకర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆమె వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
జంజా వ్యాఖ్యలపై మస్క్ నవ్వుతున్న ఎమోజీతో స్పందించారు. వచ్చే ఎన్నికల్లో బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ఓడిపోతారని జోస్యం చెప్పారు. కాగా, బ్రెజిల్‌లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఎక్స్ ఖాతాలను తొలగించాలని అక్కడి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డె మోరాసే ఆదేశించినా మస్క్ విస్మరించారు. దీంతో దాదాపు నెల రోజులపాటు ఎక్స్ సేవలను దేశంలో నిలిపివేశారు. అంతేకాదు, కోర్టు ఆయనకు 5.2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 43 కోట్లు) జరిమానా విధించింది.