- తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ రామ్మూర్తినాయుడు మృతి
- నేడు స్వగ్రామం నారావారిపల్లెలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
- పాడె మోసిన చంద్రబాబు, నారా లోకేశ్
- భారీగా తరలి వచ్చిన జనం
సీఎం చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. స్వగ్రామమైన నారావారిపల్లెలో ఆదివారం నాడు ప్రభుత్వ లాంఛనాల నడుమ అంత్యక్రియలు ముగిశాయి.
అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తినాయుడు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్ర పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. పార్థివదేహాన్ని ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి రేణిగుంటకు తీసుకొచ్చి, అక్కడి నుండి రోడ్డు మార్గాన నారావారిపల్లెకు తరలించారు. అభిమానులు, ఆప్తులు, బంధుమిత్రులు, నేతలు, ప్రజల సందర్శనార్ధం నారావారిపల్లెలోని సీఎం చంద్రబాబు నివాసంలో భౌతికకాయాన్ని ఉంచారు. తమ్ముడ్ని చివరిసారి చూసుకుని చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు.
మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు రామ్మూర్తినాయుడుకి నివాళులర్పించారు. చంద్రబాబు, లోకేశ్, రామ్మూర్తినాయుడి కుటుంబ సభ్యులు ఇందిర, రోహిత్, గిరీశ్ లను పరామర్శించారు.
అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు భారీ జనసందోహం మధ్య రామ్మూర్తినాయుడి అంతిమయాత్ర ప్రారంభమైంది. రామ్మూర్తినాయుడుని చివరి చూపు చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ్ముడి పాడెను చంద్రబాబు మోశారు. లోకేశ్ కూడా చిన్నాన్న పాడెను మోశారు. తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ, ఖర్జూరనాయుడు అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలోనే ప్రభుత్వ లాంఛనాలతో రామ్మూర్తినాయుడి అంతిమ సంస్కారాలు చేపట్టారు.