- గర్భవతి అని నిర్ధారించిన వైద్యులు
- గర్భంలో నాలుగు పిండాలు వృద్ధి చెందుతున్నట్టు వెల్లడి
- అమెరికాలోని ఇల్లినాయిస్‌కు చెందిన యువతికి షాక్
నర్సింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ 20 ఏళ్ల యువతి గొంతు నొప్పిగా ఉండడంతో చికిత్స కోసం హాస్పిటల్‌కు వెళ్లింది. సమస్య ఏమిటో తెలుసుకునేందుకు ఎక్స్-రే తీయించుకొని రావాలని వైద్యులు సూచించారు. అయితే ఒకవేళ గర్భవతి అయ్యుంటే రేడియేషన్ ప్రభావం పడుతుందేమోనన్న ఆందోళనతో ముందుగా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో టెస్ట్ చేయించుకున్న యువతికి జీవితమే మారిపోయే విషయం తెలిసిందే. ఆమె గర్భవతి అని నిర్ధారణ అయింది. హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్ (హెచ్‌సీజీ) స్థాయులను బట్టి ఆమె గర్భంలో ఏకంగా నాలుగు పిండాలు ఏర్పడ్డాయని వైద్యులు నిర్ధారించారు.
అమెరికాలోని ఇల్లినాయిస్‌కు చెందిన 20 ఏళ్ల కాటెలిన్ యేట్స్ అనే యువతికి ఈ షాకింగ్ అనుభవం ఎదురైంది. యేట్స్ ఈ ఏడాది ఏప్రిల్ 1న హాస్పిటల్‌కు వెళ్లింది. దీంతో ‘ఏప్రిల్ ఫూల్’ సందర్భంగా వైద్యులు ఆట పట్టిస్తున్నారేమోనని ఆమె భావించింది. జోక్ అని భావించి నమ్మలేదు. కానీ ఆ తర్వాత వాస్తవాన్ని అర్థం చేసుకుంది. ఇక ఆమెకు కాబోయే భర్త జూలియన్ బ్యూకర్ ఈ వార్త విని చాలా సంతోషించాడు. కాబోయే వాడి నుంచి ఎలాంటి అభ్యంతరం లేకపోవడంతో ఆమె కూడా సంతోషించింది.
కాగా గర్భం పెరుగుదల సమయంలో యేట్స్ పలు సమస్యలు ఎదుర్కొంది. ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్తలు తీసుకుంది. గర్భం 20 వారాలు దాటిన తర్వాత ఆమె హైబీపీ లాంటి పరిస్థితిని ఎదుర్కొంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అంతేకాదు కాలేయ సమస్యలు, మూత్రపిండాల సమస్యలు కూడా వచ్చాయి. అయినప్పటికీ వీటన్నింటిని ఆమె భరించింది. సరిగ్గా 28 వారాల 4 రోజులలో ఇల్లినాయిస్‌లోని స్ప్రింగ్‌ఫీల్డ్‌లోని హెచ్‌ఎస్‌హెచ్‌ఎస్ సెయింట్ జాన్స్ హాస్పిటల్‌లో చేరారు. అక్టోబరు 17న నలుగురు బిడ్డలను ఆమె ప్రసవించింది. చివరిగా పుట్టిన చిన్నపాప (ఎలిజబెత్) అత్యల్పంగా 1 పౌండ్, 2 ఔన్సుల బరువు ఉంది. అత్యధికంగా మాక్స్(పిల్లాడు) 2 పౌండ్ల 6 ఔన్సుల బరువు ఉన్నాడు.
ప్రస్తుతం నలుగురు శిశువులూ క్రమంగా బరువు పెరుగుతూ ఆరోగ్యంగా ఉన్నారు. అసాధారణ రీతిలో ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చిన ఆమె ఇటీవల ఓ మీడియాతో సంస్థతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. గర్భవతిననే విషయం ఎలా తెలిసింది, గర్భం సమయంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నదీ ఆమె వివరించారు. కాగా ‘జర్నల్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్’ రిపోర్ట్ ప్రకారం.. గర్భంలో ఒకేసారి నాలుగు పిండాలు ఏర్పడడం 500,000 ప్రెగ్నెన్సీల్లో ఒకసారి జరుగుతుంది.