- పీసీబీతో కలిసి పని చేయాలని హైడ్రా నిర్ణయం
- పీసీబీ మెంబర్ రవితో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ
- కాల్వలు, చెరువుల్లోకి మురుగునీరు రాకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చ
కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) మెంబర్ సెక్రటరీ రవితో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ నగరంలోని చెరువులను పరిరక్షించడం కోసం హైడ్రా… పీసీబీతో కలిసి పని చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో పీసీబీ కార్యాలయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా వారు… కాల్వలు, చెరువుల్లోకి మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పారిశ్రామిక వ్యర్థాలు డంప్ చేయకుండా ఇరు విభాగాల సిబ్బందితో గట్టి నిఘా పెట్టాలని నిర్ణయించారు. చెరువులు, కాల్వల్లో కలిసే వ్యర్థాలు ఏ కంపెనీ నుంచి వస్తున్నాయో గుర్తించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
త్వరలో పారిశ్రామిక వర్గాలతో సమావేశమై పీసీబీ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పిస్తారు. పారిశ్రామిక వర్గాలతో పాటు పర్యావరణవేత్తలు, విద్యార్థులు, స్థానికులతోనూ సమావేశమై… వీరితో చెరువుల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.