- ఇటీవల కాలంలో పెరిగిపోతున్న మధుమేహ బాధితులు
- జీవన శైలి మార్పులతో నియంత్రణలో ఉంచుకోవచ్చంటున్న ఆరోగ్య నిపుణులు
- రోజూ తప్పనిసరిగా వాకింగ్ చేయాలని సూచనలు
ఇటీవలి కాలంలో మధుమేహం (షుగర్)తో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. ఆధునిక సౌకర్యాలతో మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు వంటివి దీనికి కారణం అవుతున్నాయని ఆరోగ్య నిపుణులు తేల్చి చెప్తున్నారు. మధుమేహం బారినపడినవారు.. జీవన శైలిలో కాస్త మార్పులతో దానిని నియంత్రణలో ఉంచుకోవచ్చని వివరిస్తున్నారు. ముఖ్యంగా రోజూ తప్పనిసరిగా వాకింగ్ చేయాలని స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎంత సేపు నడవాలి, ఎలా నడక సాగించవచ్చనే దానిపై కొన్ని సూచనలు చేస్తున్నారు.
మధుమేహ బాధితులు రోజూ తప్పనిసరిగా కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలని… దానితో రక్తంలో గ్లూకోజ్ నిల్వలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
- ఇప్పటివరకు వాకింగ్ పెద్దగా చేయనివారు మొదట కేవలం ఐదు, పది నిమిషాల పాటు చేయాలి. తర్వాత సమయం పెంచుకుంటూ వెళ్లాలి.
- కొత్తగా వాకింగ్ చేస్తున్నవారు మొదట్లో మెట్లు ఎక్కి దిగడం, ఎగుడు దిగుడుగా ఉన్న చోటగానీ వాకింగ్ చేయవద్దు. దానివల్ల కీళ్లపై ప్రభావం పడుతుంది.
- ఎక్కువ సేపు తినకుండా ఉన్న సమయాల్లో వాకింగ్ చేయవద్దు. భోజనంగానీ, అల్పాహారంగానీ ఏదైనా తీసుకున్న కొంత సేపటి తర్వాత కనీసం పది నిమిషాలు వాకింగ్ చేయాలి. దీనివల్ల ఆహారం బాగా జీర్ణమవడంతోపాటు రక్తంలో షుగర్ స్థాయులు నియంత్రణలో ఉంటాయి.
- వరుసగా అరగంట పాటు నడవలేనివారు, ఇబ్బంది ఉన్నవారు.. పది నిమిషాల చొప్పున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వాకింగ్ చేయాలి.
- ఇందులో కాసేపు శరీరానికి ఇబ్బంది లేనంత వరకు వేగంగా వాకింగ్ కొనసాగించాలి.
- వాకింగ్ సమయంలో ధరించే షూ, చెప్పులు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. లేకుంటే సమస్యలు వస్తాయి.
- న్యూరో (నాడీ సంబంధిత) సమస్యలు ఉన్నవారు, కీళ్లు, ఎముకల సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు వాకింగ్ చేయాలి.