Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆరోగ్యం

బీపీ చెక్​ చేసుకుంటున్నారా… సరైన రీడింగ్​ రావాలంటే ఇలా చేయాలి!

  • కొన్నాళ్లుగా పెరిగిపోతున్న అధిక రక్తపోటు సమస్య
  • ఎప్పటికప్పుడు ఇంట్లోనే చెక్ చేసుకునేలా పరికరాలు
  • కఫ్ పెట్టుకోవడం నుంచి కూర్చోవడం దాకా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణుల సూచనలు ఇవిగో!

ఇటీవలి కాలంలో చాలా మందిలో అధిక రక్తపోటు (హైబీపీ) సమస్య తలెత్తుతోంది. తీవ్రమైన పని ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం, జంక్ ఫుడ్, ఉప్పు, చక్కెర, మసాలాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం, శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం వంటివి దీనికి కారణం అవుతున్నాయి. ఇంతకు ముందు హైబీపీ బారినపడినవారు బీపీని చెక్ చేసుకోవాలంటే ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇంట్లోనే చెక్ చేసుకునేందుకు వీలుగా ఎన్నో పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. చాలా మంది ఇళ్లలోనే బీపీ చెక్ చేసుకుంటున్నారు. కానీ సరైన పద్ధతులు పాటించక… బ్లడ్ ప్రెషర్ రీడింగ్స్ లో తేడాలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో బీపీ చెక్ చేసుకునేప్పుడు అనుసరించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.

ఒక వేలు పట్టేంత గ్యాప్ ఉండాలి
బీపీ చెక్ చేసుకునేప్పుడు చేతికి చుట్టే పట్టీ (కఫ్)ని బాగా బిగుతుగా గానీ, వదులుగా గానీ పెట్టుకోవద్దు. కఫ్ పెట్టుకున్న తర్వాత… దానికి చర్మానికి మధ్య ఒక వేలు పెట్టేంత గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.

గుండెకు సమాన ఎత్తులో ఉండేలా చూడాలి 
బీపీ యంత్రంలోని కఫ్ ను చేతికి పెట్టుకున్నప్పుడు అది మన గుండెకు సమాన ఎత్తులో ఉండాలి. బాగాపైకి భుజం దగ్గరగా గానీ… కిందకు మోచేయి దగ్గరగా గానీ ఉండొద్దు. మన చేతిని కూడా పైకి, కిందకి పెట్టవద్దు. కుర్చీలో కూర్చుని చేతిని హ్యాండ్ రెస్ట్ పై పెట్టినట్టుగా ఉంచాలి.

కదలకుండా, మాట్లాడకుండా కూర్చోవాలి
బీపీ చెక్ చేసుకునేప్పుడు పెద్దగా మాట్లాడకుండా, శరీరాన్ని కదిలించకుండా ఉండాలి. కాలుపై కాలు వేసుకుని గానీ, ఓ వైపు వంగిపోయినట్టుగానీ కూర్చోవద్దు. అలా చేయడం వల్ల రీడింగ్స్ లో తేడాలు వస్తాయి.

కాఫీ, టీ తాగాక, ఎక్సర్ సైజ్ చేశాక చెక్ చేయవద్దు
కాఫీ, టీలు, వ్యాయామం వంటివి శరీరంలో తాత్కాలికంగా రక్త పోటును పెంచుతాయి. అందువల్ల కనీసం 30 నిమిషాల తర్వాతే బీపీ చెక్ చేసుకోవాలి.

బాత్రూమ్ కు వెళ్లాల్సినప్పుడు వద్దు
మూత్రం వచ్చినట్టుగా, బాత్రూమ్ కు వెళ్లాల్సి వచ్చేలా ఉన్నప్పుడు శరీరంలో రక్త పోటు కాస్త ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వెళ్లి వచ్చిన తర్వాతే బీపీ చెక్ చేసుకోవాలి.

Related posts

చన్నీటి స్నానంతో ఇంతటి ప్రమాదం ఉందని తెలుసా?

Ram Narayana

తన ఆరోగ్య రహస్యం గురించి చెప్పిన చంద్రబాబు….

Ram Narayana

పెరుగుతున్న కరోనా … నెలలో 51 శాతం పెరిగిందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

Ram Narayana

Leave a Comment