- సంప్రదాయం ప్రకారం పీఏసీ చైర్మన్ పదవిని తమకే ఇవ్వాలని వైసీపీ పట్టు
- అందుకు తగినంత బలం లేకున్నా పెద్దిరెడ్డిని బరిలోకి దింపుతున్న అధిష్ఠానం
- పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే 18 మంది ఎమ్మెల్యేల బలం అవసరం
- ఆ పార్టీకి ఉన్నది 11 మందే
- ఏం జరుగుతుందోనని సర్వత్ర ఉత్కంఠ
ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవిని ప్రతిపక్షానికే ఇవ్వాలని పట్టుబడుతున్న వైసీపీ ఆ పదవికి నామినేషన్ వేయాలని నిర్ణయించింది. ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో నామినేషన్ వేయించాలని భావిస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ వద్దకు చేరుకున్న పెద్దిరెడ్డి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. నిజానికి పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావడానికి 18 మంది ఎమ్మెల్యే బలం ఉండాలి. కానీ వైసీపీకి ఉన్నది 11 మందే.
బలం లేకున్నా పీఏసీ చైర్మన్ పదవి బరిలోకి వైసీపీ దిగడంపై ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. పీఏసీలో మొత్తం 12 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 9 మంది శాసనసభ నుంచి, మిగతా ముగ్గురు మండలి నుంచి ఎన్నికవుతారు. అయితే, చైర్మన్‌ను మాత్రం శాసనసభ్యుల నుంచే ఎన్నుకుంటారు. గతంలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి ఒక్క సభ్యుడిని ఎన్నుకునేంత బలం ఉండడంతో పయ్యావుల కేశవ్‌కు ఆ అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం నుంచి పీఏసీ చైర్మన్ ఉండాలన్న సంప్రదాయం మేరకు ఆయననే చైర్మన్‌గా నియమించారు. ప్రస్తుత అసెంబ్లీలో మాత్రం ఒక్కరిని ఎన్నుకునేంత బలం కూడా వైసీపీకి లేదు. అయినా వైసీపీ చైర్మన్ బరిలోకి దిగడం ఆసక్తి రేపింది.