Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

ఇక సెలవు… జీవితంలో రాజకీయాల జోలికి వెళ్లను: పోసాని…

  • హైదరాబాదులో పోసాని ప్రెస్ మీట్
  • కేసుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోలేదని వెల్లడి
  • వయసుతో తేడా లేకుండా అసభ్యంగా దూషిస్తున్నారని ఆవేదన
  • మంచి నేతలను ఎప్పుడూ విమర్శించలేదని స్పష్టీకరణ

ఎన్నికల్లో ఓటమి అనంతరం… వైసీపీ నాయకులకు, ఆ పార్టీ మద్దతుదారులకు ఎదురుగాలి వీస్తోంది. ముఖ్యంగా వారిని పోలీసు కేసులు వెంటాడుతున్నాయి. అలాంటి కేసుల సెగ ఎదుర్కొంటున్న వారిలో సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కూడా ఉన్నారు. 

గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పోసాని… పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేశ్ తదితరులపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా… పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఆయనపై సీఐడీ కేసు నమోదైంది. 

ఈ నేపథ్యంలో, పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం ప్రకటించారు. ఇక జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడనని, ఇటీవల టీవీలో డింగ్ డాంగ్ పేరిట ఓ రాజకీయ షో చేస్తున్నానని, ఇకపై ఆ ప్రోగ్రామ్ కు కూడా వెళ్లనని ప్రతిజ్ఞ చేశారు. ఏ పార్టీని పొగడను, సపోర్ట్ చేయను అని స్పష్టం చేశారు. 

అయితే, తనపై కేసులు పెడుతున్నారన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకోలేదని పోసాని అన్నారు. వయసుతో తేడా లేకుండా అసభ్యకరంగా దూషిస్తున్నారని వాపోయారు. తాను ఎక్కువగా పొగిడింది చంద్రబాబునే అని, ఈ విషయం ఆయనను అడిగితే చెబుతారని వెల్లడించారు. 

‘శ్రావణమాసం’ సినిమా సమయంలో 100 అడుగుల చంద్రబాబు కటౌట్ కట్టించానని, అప్పుడు అధికారంలో లేకపోయినా ఆయనతోనే ప్రారంభోత్సవం చేయించానని పోసాని తెలిపారు. చంద్రబాబు తనను, తన కుమారులను దీవించారని వివరించారు. కానీ చంద్రబాబు తప్పులను విమర్శించడంతో సమస్య మొదలైందని అన్నారు. 

తాను 1983 నుంచి రాజకీయాలు మాట్లాడుతున్నానని, ఒక పార్టీకి మద్దతిస్తూ మరో పార్టీని తిట్టడం తనకు తెలియదని పేర్కొన్నారు. తాను చంద్రబాబునే కాకుండా…. జగన్, వైఎస్సార్, ఎన్టీఆర్ అందరినీ కూడా మంచి చేస్తే పొగిడానని, తప్పు చేస్తే విమర్శించానని తెలిపారు. 

ఆయా నేతల చర్యలను బట్టే తన మాటలు ఉంటాయని, మంచి నాయకులను ఎప్పుడూ విమర్శించలేదని స్పష్టం చేశారు. ఏదేమైనా రాజకీయాలకు శాశ్వతంగా వీడ్కోలు పలుకుతున్నానని మీడియా ముఖంగా పోసాని ప్రకటించారు.

Related posts

రేవంత్ రెడ్డి నివాసానికి షర్మిల… కొడుకు వివాహ పత్రిక అందజేత

Ram Narayana

తన దాడిలో గాయపడిన టీవీ రిపోర్టర్ ను పరామర్శించిన మోహన్ బాబు…

Ram Narayana

అమెరికాలో కూడా ఇదే జరుగుతోంది: రామ్ గోపాల్ వర్మ!

Ram Narayana

Leave a Comment