- ఒకేసారి మూడు సీజన్ల తేదీలు ప్రకటించిన ఐపీఎల్ అధికారులు
- వచ్చే ఏడాది మార్చి 14 నుంచి మే 25 వరకు ఐపీఎల్ 2025 నిర్వహణ
- ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 15-మే 31 వరకు, ఐపీఎల్ 2027 ఎడిషన్ మార్చి 14 -మే 30 వరకు నిర్వహించనున్నట్టు ప్రకటన
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అనూహ్యమైన ప్రకటన చేసింది. తదుపరి మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలను శుక్రవారం ఉదయం ప్రకటించింది. తక్షణ ప్రాధాన్యత అయిన ఐపీఎల్ 2025 సీజన్ వచ్చే ఏడాది మార్చి 14 (శుక్రవారం) నుంచి మే 25 (ఆదివారం) వరకు జరగనుందని వెల్లడించింది.
ఇక ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 15 నుంచి మే 31 వరకు, ఐపీఎల్ 2027 ఎడిషన్ మార్చి 14 నుంచి మే 30 వరకు జరగనుందని ప్రకటించింది. ఈ మేరకు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ అధికారిక సమాచారం అందించింది.
బీసీసీఐ, ఐపీఎల్ అధికారుల ప్రకటన క్రీడా వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ఐపీఎల్ తేదీల ప్రకటన విషయంలో చాలా జాప్యం జరుగుతుంటుంది. మునుపటి కొన్ని సీజన్లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. చివరి నిమిషం వరకు వేచి చూసి ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా మూడు సంవత్సరాల తేదీలను ప్రకటించడం ఆశ్చర్యకరంగా మారింది. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్స్ కారణంగా ఇబ్బందులు ఎదురవుతుండడాన్ని దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఈసారి ఇంత ముందుగా ప్రకటించింది.