Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అదానీతో ఒప్పందం చేసుకోలేదు.. వైసీపీ ప్రభుత్వంపై వస్తున్న వార్తల్లో నిజం లేదు: వైసీపీ!

  • అదానీపై అమెరికాలో కేసు
  • గత ఏపీ ప్రభుత్వాధినేతకు రూ. 1,750 కోట్లు లంచంగా ఇచ్చారని ఆరోపణ
  • తమ ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుందన్న వైసీపీ

భారత్ లో సోలార్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు రూ. 2,100 కోట్లు లంచంగా ఇచ్చారంటూ అదానీతో పాటు 8 మందిపై అమెరికాలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. గత ఏపీ ప్రభుత్వాధినేతకు రూ. 1,750 కోట్లు లంచంగా ఇచ్చారని కేసులో పేర్కొన్నారు. దీనిపై వైసీపీ కేంద్ర కార్యాలయం అధికారికంగా స్పందించింది. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో మాత్రమే వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని… అదానీ గ్రూప్ తో ఏపీ డిస్కమ్ లు ఒప్పందాలు చేసుకోలేదని తెలిపింది. వైసీపీ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేసింది.  

ఉచిత విద్యుత్ ను రైతులకు అందించాలనే లక్ష్యంతో 7 వేల మెగావాట్ల విద్యుత్ ను అత్యంత చౌకగా యూనిట్ కు రూ. 2.49 చొప్పున 2021 డిసెంబర్ 1న ఏపీ డిస్కమ్ లు ఒప్పందం చేసుకున్నాయని తెలిపింది. చంద్రబాబు అనాలోచిత విధానాలతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల యూనిట్ ధర రూ. 5.10కి చేరిందని… ఇది డిస్కమ్ లపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని చెప్పింది. 

ఈ సమస్యను పరిష్కరించేందుకు సోలార్ పార్క్ లను అభివృద్ధి చేయాలని 2020లో ప్రభుత్వం ప్రతిపాదించిందని తెలిపింది. అంతర్రాష్ట్ర విద్యుత్ ఛార్జీలను మినహాయించి యూనిట్ రూ. 2.49 చొప్పున విద్యుత్ సరఫరా చేసేందుకు సెకీ ప్రతిపాదించిందని… అదే ధరతో 25 ఏళ్ల పాటు 7 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని వెల్లడించింది. దీని వల్ల ప్రభుత్వానికి ప్రతి ఏటా రూ. 3,700 కోట్ల మేర ఆదా అవుతుందని… 25 ఏళ్ల పాటు ఒప్పందం అమల్లో ఉండటం వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదా అవుతుందని తెలిపింది.

Related posts

లైంగిక వేధింపుల కేసులో డొనాల్డ్ ట్రంప్‌కు షాక్..

Drukpadam

అనుమతులు లేని ప్రాజెక్టులు తక్షణం ఆపండి …కృష్ణా నది యాజమాన్య బోర్డు!

Drukpadam

అసెంబ్లీ ఎవడబ్బ సొత్తుకాదని గుర్తు పెట్చుకో …పొంగులేటికి ఎంపీ వద్దిరాజు వార్నింగ్

Drukpadam

Leave a Comment