ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా చేశాడు.. జగన్ పై షర్మిల ఫైర్
- జగన్ కు అదానీ లంచం ఇచ్చినట్లు అమెరికా స్పష్టంగా చెప్పిందన్న షర్మిల
- అదానీ దేశం పరువు తీస్తే, జగన్ ఆంధ్ర రాష్ట్రం పరువు తీశారని మండిపాటు
- రూ.1750 కోట్లు తీసుకుని ప్రజలను జగన్ తాకట్టు పెట్టారని విమర్శ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అవినీతిపై నేడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా విమర్శించారు. ఇది ఒక్క జగన్ కుటుంబానికి మాత్రమే అవమానం కాదని మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి, భారత దేశానికే అవమానకరమని అన్నారు. అదానీ గ్రూప్ లంచాల వ్యవహారంలో జగన్ కు రూ.1,750 కోట్ల ముడుపులు ముట్టాయనేది స్పష్టంగా తేలిపోయిందని పేర్కొన్నారు. జగన్ పేరు మాత్రమే బయటపెట్టలేదు తప్ప ఆయనకే లంచం ముట్టిందని అమెరికా స్పష్టంగా వెల్లడించిందని అన్నారు.
అదానీ స్వయంగా ఏపీ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తితో రూ.1,750 కోట్లకు డీల్ కుదుర్చుకున్నాడని, దీంతో అదానీ కంపెనీతో ఏపీ ప్రభుత్వం 25 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారని గుర్తుచేశారు. జగన్ తన స్వార్థం కోసం దండుకున్న లంచంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఎంత భారం పడుతుందనేది ఆలోచించలేదన్నారు. లంచం తీసుకుని సోలార్ పవర్ ను అధిక ధరకు కొనుగోలు చేశాడని షర్మిల మండిపడ్డారు.
జగన్ కు ముట్టిన 1750 కోట్లకు బదులుగా రాష్ట్ర ప్రజలపై రాబోయే రోజుల్లో రూ.లక్ష కోట్ల భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఎప్పుడూ విశ్వసనీయత అంటూ కబుర్లు చెబుతారని గుర్తుచేస్తూ.. అదానీ కంపెనీ విషయంలో లంచం పుచ్చుకుని జగన్ తన విశ్వసనీయతను తనే కాలరాసుకున్నారని విమర్శించారు. అదానీ దేశం పరువు తీస్తే జగన్ ఆంధ్ర రాష్ట్ర పరువును గంగలో కలిపాడని మండిపడ్డారు.
అదానీ కంపెనీతో జగన్ చేసుకున్న డీల్స్ లో ఇదొకటి మాత్రమేనని, బయటకు రాని డీల్స్ ఇంకా ఎన్ని ఉన్నాయోనని షర్మిల సందేహం వ్యక్తం చేశారు. గంగవరం పోర్టులో ప్రభుత్వానికి పది శాతం వాటా ఉండేదని షర్మిల గుర్తుచేశారు. ఈ పోర్టు మళ్లీ ప్రభుత్వం చేతికి రావాలని స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తపన పడ్డారని చెప్పారు. అయితే, వైఎస్ జగన్ సీఎం అయ్యాక గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను నామమాత్రపు ధరకే గౌతమి అదానీకి కట్టబెట్టారని ఆరోపించారు.
దాదాపు 9 వేల పైచిలుకు విలువైన వాటాను అదానీకి కేవలం రూ.640 కోట్లకు అమ్మేశారని మండిపడ్డారు. ఈ డీల్ లో ఎంత లంచం వచ్చిందో జగన్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి డీల్స్ ఎన్నో కుదుర్చుకున్నారని, వాటిలో ఎంత లంచాలు తీసుకున్నారో విచారించే వారేలేరని ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టులు, డేటా సెంటర్ ఏర్పాటు, సబ్ మెరైన్ డీల్.. ఇలా ప్రాజెక్టులన్నీ అదానీకి కట్టబెట్టారని షర్మిల ఆరోపించారు. అదానీకి అప్పగించిన డీల్స్ అన్నింటినీ రద్దు చేసి, అదానీ గ్రూప్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు.
జగన్ అవినీతిపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందన్నారు. అదానీ అవినీతిపై ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ విచారణ జరిపించాలని, లేకపోతే మోదీ అవినీతిలో కూరుకుపోయారని భావించాల్సి ఉంటుందని షర్మిల స్పష్టం చేశారు. కేవలం పది పన్నెండేళ్ల వ్యవధిలోనే అదానీ అనే వాడు ప్రపంచ కుబేరుడిగా ఎదిగాడని, దీని వెనక ఎన్ని అవినీతి అక్రమాలు ఉన్నాయో విచారణ జరిపితే బయటపడతాయని షర్మిల చెప్పారు.