- మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం
- ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన స్థానాల్లోనూ కూటమి విజయకేతనం
- పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన సోలాపూర్ సిటీ సెంట్రల్ బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర రాజేశ్ కోతే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 స్థానాలకు గానూ 234 స్థానాల్లో మహాయుతి కూటమి విజయకేతనం ఎగురవేసింది. అయితే, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు పాల్గొన్న విషయం తెలిసిందే.
నాడు బీజేపీ కూటమి అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ పవన్ కల్యాణ్ నిర్వహించిన సభలు, ర్యాలీలు విజయవంతం అయ్యాయి. ఎన్నికల ఫలితాలు చూసుకుంటే.. పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన అన్ని ప్రాంతాల్లో మహాయుతి కూటమి అభ్యర్ధులు విజయం సాధించారు. సోలాపూర్ సిటీ సెంట్రల్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన బీజేపీ అభ్యర్ధి దేవేంద్ర రాజేశ్ కోతే..పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన స్పందిస్తూ పవన్ కల్యాణ్‌కు తానెంతో రుణపడి ఉన్నానన్నారు.
ఈ విజయం కేవలం ఆయన (పవన్) వల్లే సాధ్యమైందని చెప్పుకొచ్చారు. అభిమానులు, మద్దతుదారులకు ధన్యవాదాలు తెలిపారు. ‘రెండు గంటలు మీరు (పవన్) చేసిన రోడ్ షోకి భారీగా జనాలు వచ్చి మద్దతు ఇచ్చారు. మీ మాటలతో మహారాష్ట్ర సోలాపూర్ ప్రజలను ప్రభావితం చేశారు’ అని దేవేంద్ర పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ దేవేంద్ర మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.