- ప్రతిపక్ష ఎంపీల నినాదాల మధ్య ఉభయ సభలు రోజంతా వాయిదా
- బుధవారం తిరిగి ప్రారంభమవనున్న సమావేశాలు
- రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం విరామం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. విపక్షాల నినాదాల మధ్య లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రొసీడింగ్స్ మొదలయ్యాయి. అయితే అదానీ లంచం వ్యవహారంపై చర్చ చేపట్టాలంటూ విపక్ష ఎంపీలు నినాదాలు చేయడంతో ఉభయ సభలు ఒక రోజంతా వాయిదా పడ్డాయి. దీంతో ఉభయ సభలు తిరిగి బుధవారం ప్రారంభమవనున్నాయి. సమావేశాలు ప్రారంభమవగానే ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు మొదలుపెట్టారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే మధ్యాహ్నం 12 గంటలకు సభలు వాయిదాపడ్డాయి. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా నినాదాలు కొనసాగడంతో ఒక రోజంతా వాయిపడ్డాయి. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలను నిర్వహించడం లేదని ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ హౌస్‌లో సభలో విపక్షాల వ్యూహాన్ని నిర్ణయించేందుకు ఇండియా కూటమికి చెందిన పార్టీల ఫ్లోర్ లీడర్లు సమావేశమయ్యారు. ‘మణిపూర్ అంశాన్ని ఉభయ సభల్లో లేవనెత్తాలని కోరామని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ తెలిపారు. మణిపూర్‌లో శాంతిభద్రతలతో పాటు దేశంలో నిరుద్యోగ సమస్య, ఉత్తర భారతంలో కాలుష్య పరిస్థితితో పాటు పలు అంశాలపై మాట్లాడతామన్నారు. మరోవైపు జాయింట్ పార్లమెంటరీ కమిటీ పదవీకాలాన్ని పొడిగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను అభ్యర్థించాయి. కమిటీ తన పరిధిలోని కీలకమైన విషయాలను క్షుణ్ణంగా పరిశోధించి, చర్చించడానికి మరింత సమయాన్ని ఇవ్వాలని కోరాయి.
కాగా ఈ పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. వక్ఫ్ చట్టం (సవరణ) బిల్లుతో సహా పలు కీలక బిల్లులపై చర్చించనున్నారు. పార్లమెంట్ పరిశీలన కోసం ప్రభుత్వం మొత్తం 16 బిల్లులను లిస్టింగ్ చేసింది.