- క్యూఆర్ కోడ్‌లో రానున్న కొత్త పాన్ కార్డులు
- అందుబాటులోకి రానున్న మెరుగైన డిజిటల్ సేవలు
- మరింత పటిష్ఠం కానున్న డేటా భద్రత
- అప్‌డేట్ కానున్న ప్రస్తుత విధానం
- రూ.1,435 కోట్ల వ్యయంతో ‘పాన్ 2.0 ప్రాజెక్ట్’కు కేంద్రం ఆమోదం
దేశంలో పన్నులకు సంబంధించిన పరిపాలనను ఆధునికీకరించేందుకు ‘పాన్ 2.0’ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రూ.1,435 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ సోమవారం ఆమోదం కూడా తెలిపింది. దీంతో త్వరలో క్యూఆర్ కోడ్‌తో కూడిన నూతన కొత్త వెర్షన్ పాన్‌కార్డులను వినియోగదారులు అందుకోనున్నారు. ‘పాన్ 2.0’ అనేది ఒక ‘ఈ-గవర్నెన్స్ ప్రాజెక్ట్’. మెరుగైన డిజిటల్ సేవలతో చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశం. ఈ ప్రాజెక్టులో పాన్/టాన్ (TAN) 1.0 ఎకో-సిస్టమ్ అప్‌గ్రేడ్ అవుతుంది. పాన్ 2.0లో టెక్నాలజీతో కూడిన సేవలు అందుబాటులోకి వస్తాయి.
ఏం మార్పులు వస్తాయి?
కొత్త పాన్ ప్రాజెక్ట్ ఆచరణలోకి వస్తే ఇప్పటికే వినియోగంలో ఉన్న విధానంలో సమగ్రమైన మార్పులు వస్తాయి. నిర్దిష్ట రంగాలలో వ్యాపార కార్యకలాపాలకు యూనిఫైడ్ ఐటెంటిఫయర్‌గా నూతన పాన్‌కార్డ్ పనిచేస్తుంది. అంతేకాదు పన్ను దాఖలు సులభతరంగా మారిపోతుంది. వివిధ ప్రక్రియల ఏకీకరణ కూడా మరింత సులభతరం అవుతుంది.
పాన్‌కార్డు వినియోగదారుల సౌలభ్యం, అన్ని సేవలు అందుబాటులో ఉండేలా ఒక యూనిఫైడ్ పోర్టల్ కూడా అందుబాటులోకి వస్తుంది. కేంద్రీకృతమైన ఈ ప్లాట్‌ఫామ్‌పై ఒకేచోట అన్ని పాన్ సంబంధిత సేవలు లభిస్తాయి. నూతన పాన్ విధానంలో సైబర్ సెక్యూరిటీ చర్యలు కూడా పటిష్ఠంగా ఉంటాయి. సైబర్ ముప్పులు, అనధికారిక యాక్సెస్‌ల నుంచి వినియోగదారులకు సంరక్షణ ఉంటుంది. ఇందుకు అనుగుణంగా స్ట్రాంగ్ ప్రోటోకాల్స్ అమల్లోకి వస్తాయి. ఇక పాన్ డేటా వాల్ట్‌తో పాన్ వినియోగదారుల డేటా కూడా సురక్షితంగా ఉంటుంది. పాన్ డేటాను సురక్షితంగా స్టోర్ చేయడం తప్పనిసరిగా మారిపోతుంది.
పాతది పని చేయాదా?
పాన్ 2.0 ప్రాజెక్ట్ ద్వారా వేగవంతమైన, సులభమైన సేవలు అందుబాటులోకి వస్తాయి. అయితే ఇప్పటికే అమలులో ఉన్న పాన్‌కార్డ్ కూడా చెల్లుబాటు అవుతుంది. కొత్త పాన్ నంబర్ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుత పాన్ కొత్త సిస్టమ్‌కు అప్‌గ్రేడ్ అవుతుందని వివరించారు. దరఖాస్తులు అవసరం లేకుండానే నూతన పాన్‌కార్డులు వినియోగదారులకు అందుతాయి. కొత్త పాన్‌కార్డ్ కోసం ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. నూతన పాన్ కార్డులతో కార్యకలాపాలు మెరుగవుతాయి. ధ్రువీకరణ కోసం క్యూఆర్ కోడ్ వంటి మెరుగైన టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. స్కాన్ చేసిన వెంటనే నిర్ధారణ పూర్తవుతుంది. తద్వారా సేవలన్నీ ఆన్‌లైన్‌లో పొందే వీలుంటుంది. తద్వారా అవాంతరాలు లేని సేవలు పొందవచ్చు.