- ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లను నిర్ధారించే వరకు పర్యవేక్షణ తమదేనన్న హైకోర్టు
- ఇప్పటి వరకు పలు చెరువులకు నోటిఫికేషన్లు జారీ చేశామన్న హెచ్ఎండీఏ
- తదుపరి విచారణ డిసెంబర్ 30కి వాయిదా వేసిన హైకోర్టు
హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లను నిర్ధారించే వరకు హైదరాబాద్‌లోని చెరువుల పర్యవేక్షణ బాధ్యత తమదేనని తెలంగాణ హైకోర్టు స్పషం చేసింది. నగరంలోని అన్ని చెరువుల పర్యవేక్షణ తమదేనని తెలిపింది. రామమ్మ చెరువు బఫర్ జోన్‌లో నిర్మాణాలు జరగకుండా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది.
మరోవైపు, హెచ్ఎండీఏ పరిధిలో 3,532 చెరువులు ఉన్నాయని గత జులైలో విచారణ సందర్భంగా ప్రభుత్వం తెలిపింది. వాటికి బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించాలని హైకోర్టు ఆదేశించింది.
ఈరోజు రామమ్మ చెరువు బఫర్ జోన్‌పై విచారణ సందర్భంగా హెచ్ఎండీఏ కమిషనర్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటి వరకు 2,793 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేశామని, 530 చెరువులకు తుది నోటిఫికేషన్లు జారీ అయ్యాయని తెలిపారు. తదుపరి విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది. ఆ లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
సర్వే చేసి సరిహద్దులు గుర్తించే వరకు నిర్మాణాలు వద్దు: హైడ్రా కమిషనర్
- మాదాపూర్‌లోని ఈదులకుంట చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్
- చెరువు శిఖాన్ని పూడ్చేసి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించిన రంగనాథ్
- చెరువులోకి నీరు వచ్చే నాలాను దారి మళ్లించినట్లు గుర్తించిన కమిషనర్
ఈదులకుంటను సర్వే చేసి సరిహద్దులు గుర్తించే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈరోజు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మాదాపూర్‌లోని ఈదులకుంట చెరువును ఆయన పరిశీలించారు. ఖానామెట్ గ్రామంలో 6.5 గుంటల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు శిఖాన్ని పూడ్చేసి కొంతమంది బిల్డర్లు నిర్మాణాలు చేపడుతున్నట్లు గుర్తించారు. చెరువులోకి నీరు వచ్చే నాలాను బిల్డర్లు దారి మళ్లించినట్లు గుర్తించారు.
తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అనుమతులు తీసుకున్నట్లు హైడ్రా కమిషనర్ గుర్తించారు. అక్రమంగా తీసుకున్న అనుమతులతోనే నిర్మాణాలు చేపట్టినట్లు కమిషనర్ రంగనాథ్ గుర్తించారు. ఈ క్రమంలో అక్కడ సర్వే పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.