- పార్లమెంట్ లో రైల్వే మంత్రిని ప్రశ్నించిన కాంగ్రెస్ ఎంపీ
- కనీసం నెలకు ఒకసారి శుభ్రంగా ఉతికిస్తామని చెప్పిన మంత్రి
- ప్రయాణికుల సౌకర్యం, భద్రతకు పెద్దపీట వేస్తామని వివరణ
ఏసీ బోగీలలో ప్రయాణించే వారికి రైల్వే శాఖ మెత్తటి బ్లాంకెట్లను అందిస్తుంది.. ప్రయాణికుల సౌకర్యం కోసం ఇచ్చే ఈ బ్లాంకెట్ ను జర్నీ పూర్తయ్యాక లాండ్రీ సిబ్బంది వచ్చి తీసుకెళతారు. ఒకసారి ఉపయోగించారు కాబట్టి వాటిని ఉతికాకే మళ్లీ ప్రయాణికులకు అందిస్తారని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. బ్లాంకెట్లను నెలకు ఒకసారి మాత్రమే ఉతుకుతారట. స్వయంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈమేరకు బుధవారం కాంగ్రెస్ ఎంపీ కుల్దీప్ ఇందోరా అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా జవాబిచ్చారు.
ప్రయాణికుల సౌకర్యం, భద్రతలకే రైల్వే శాఖ పెద్దపీట వేస్తుందని కేంద్ర మంత్రి వైష్ణవ్ పేర్కొన్నారు. ఏసీ బోగీ ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రస్తుతం అందిస్తున్న బ్లాంకెట్లు తేలికగా, సులభంగా ఉతికేందుకు వీలుగా తయారుచేసినవని చెప్పారు. వాడిన ప్రతిసారీ వాటిని శుభ్రం చేసి మరోసారి ఉపయోగిస్తామని, కనీసం నెలకు ఒకసారి పూర్తిగా ఉతికిస్తామని వివరించారు. దీనికోసం రైల్వే శాఖ అధునాతన లాండ్రీ వ్యవస్థను అభివృద్ధి చేసుకుందని మంత్రి చెప్పారు.