- ఇబ్రహీంపట్నంలో జనం చూస్తుండగానే వేటకొడవలితో దాడి
- హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నాగమణి
- డ్యూటీకి వెళుతుండగా నాగమణిని కారుతో ఢీ కొట్టి ఆపై హత్య
తల్లిదండ్రులు చేసిన పెళ్లి బంధాన్ని తెంచేసుకుని మళ్లీ కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో ఓ యువకుడు తన సోదరినే చంపేశాడు. డ్యూటీకి వెళుతున్న కానిస్టేబుల్ నాగమణిని కారుతో ఢీ కొట్టి ఆపై వేట కొడవలితో దాడి చేశాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జరిగిన ఈ దారుణం వివరాలు.. రాయపోలుకు చెందిన నాగమణి కానిస్టేబుల్.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు గతంలోనే వివాహం కాగా పది నెలల క్రితమే విడాకులు తీసుకుంది.
నెల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. ఈ వివాహంతో తమ కుటుంబ పరువు పోయిందని నాగమణి సోదరుడు ఆవేశంతో రగిలిపోయాడు. డ్యూటికీ వెళ్లేందుకు బయలుదేరిన నాగమణిని కారుతో ఢీ కొట్టాడు. కిందపడ్డ నాగమణిపై వేటకొడవలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. జనమంతా చూస్తుండగానే ఈ ఘోరానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన నాగమణి అక్కడికక్కడే చనిపోయింది. ఈ హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నామని, నాగమణి సోదరుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.