Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆరోగ్యం

చలికాలంలో పెరుగు తినొచ్చా!? ఆయుర్వేదం ఏం చెబుతోంది?

  • చలికాలం రాగానే పెరుగుకు చాలా మంది దూరం
  • దానివల్ల జలుబు వంటి సమస్యలు వస్తాయనే భావన
  • కానీ కొన్ని జాగ్రత్తలతో పెరుగు తీసుకోవడం మంచిదని చెప్తున్న నిపుణులు

పెరుగు మన శరీరానికి ఎంతో మంచిది. ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పెరుగు నుంచి అందుతాయి. వేసవి కాలంలో చాలా మంది పెరుగును తీసుకుంటూ ఉంటారు. చలికాలం రాగానే జలుబు చేస్తుందనో, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలకు కారణం అవుతుందనే భావనతో… చాలా మంది పెరుగును దూరం పెడతారు. ఇందులో కొంత వరకు నిజం ఉన్నా పెరుగుతో వచ్చే ప్రయోజనాలను పొందడానికి… కాసిన్ని జాగ్రత్తలు తీసుకుని, వినియోగిస్తే చాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఆయుర్వేదం ఏం చెబుతోంది?
మనం పెరుగును చలువ చేసే పదార్థమని భావిస్తుంటాం. దాని లక్షణాలు కూడా అలాగే ఉంటాయి. కానీ, ఆయుర్వేదం ప్రకారం… పెరుగు వేడి చేసే (తామసిక) లక్షణం కలిగి ఉన్నదేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పెరుగు తీసుకోవడం వల్ల అంతిమంగా శరీరంలో ఉష్ణ స్వభావం పెరుగుతుందని పేర్కొంటున్నారు.

పెరుగుతో ప్రయోజనం ఏమిటి?… చలికాలంలో ఎలా తీసుకోవాలి?
మనం తినే ఆహార పదర్థాలన్నింటిలోకీ ప్రోబయాటిక్స్ మనకు అందేది చాలా వరకు పెరుగు నుంచే… అందువల్ల పెరుగు వినియోగాన్ని మొత్తంగా ఆపేయడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. మన జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుంటే… శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుందని, తద్వారా వ్యాధులు దూరంగా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. పెరుగులోని ప్రోబయాటిక్స్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపర్చేందుకు అత్యంత కీలకమని స్పష్టం చేస్తున్నారు.

  • చలికాలంలో పెరుగును తీసుకోవాలనుకుంటే… ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా ఉన్నప్పుడు వాడవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
  • గది ఉష్ణోగ్రత వద్ద మజ్జిగ రూపంలో తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
  • వీలైతే పెరుగులో మిరియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం, కాసింత ఉప్పు వంటివి కలుపుకొని బట్టర్ మిల్క్ రూపంలో తీసుకుంటే శరీరానికి మరింత మేలు చేస్తుందని వివరిస్తున్నారు.
  • అయితే చలికాలంలో పెరుగును ఏ రూపంలో అయినా పగటిపూట మాత్రమే తీసుకోవాలని… రాత్రిపూట దానికి దూరంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు.
  • కొందరిలో వారి శరీర తత్వాన్ని బట్టి పెరుగు వల్ల జలుబు, దగ్గు వంటి వాటికి వెంటనే లోనవుతారని… అలాంటి వారు చలికాలంలో పెరుగుకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Related posts

పానీపూరీ తింటున్నారా?.. అయితే, ముందుగా ఇది చదవండి!

Ram Narayana

ఈ మూడు యోగాసనాలతో గుండె జబ్బులకు చెక్ పెట్టొచ్చట!

Ram Narayana

కరోనా నుంచి కోలుకున్న ప్రతీ వందమంది పేషెంట్లలో ఆరుగురు ఏడాదిలోపే మృతి

Ram Narayana

Leave a Comment